గవర్నర్ ఆనంద్ బోస్‌పై.. మరో వివాదం
పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్‌పై మరో వివాదం చెలరేగింది. తన సొంత విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే రాజ్‌భవన్ కార్యాలయం స్పష్టత ఇచ్చింది. అది వాస్తవం కాదని పేర్కొంది. బెంగాల్ గవర్నర్ పదవిని ఆనంద్ బోస్ చేపట్టి నవంబర్ 23కు మూడేళ్లయ్యింది. ఈ సందర్భంగా ఆ రాష్ట్రానికి చెందిన కొందరు కళాకారులు తమ కళా రూపాలను ఆయనకు బహుకరించారు. ఈ నేపథ్యంలో శిల్పి పార్థ సాహా రూపొందించిన తన సొంత విగ్రహాన్ని కోల్‌కతాలోని ఇండియన్ మ్యూజియంలో గవర్నర్ ఆనంద్ బోస్ ఆవిష్కరించారు.
కాగా, బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్ తన సొంత విగ్రహాన్ని ఆవిష్కరించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. సొంత పబ్లిసిటీ కోసం ఆయన ఆరాటపడుతున్నారని ఆ రాష్ట్రంలోని అధికారంలో ఉన్న టీఎంసీ ఆరోపించింది. స్వాతంత్య్రం తర్వాత భారతదేశం ఎప్పుడూ ఇలాంటి విచిత్రమైన సంఘటనలు చూడలేదు. రాజ్యాంగ పదవికి నియమించిన ఒక వ్యక్తి రోమన్ చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారు అని టీఎంసీ నేత జై ప్రకాశ్ మజుందార్ విమర్శించారు.