అన్నమయ్యపురంలో అనఘ కృతి స్వరార్చన
అన్నమాచార్య భావనా వాహిని సంస్థ వ్యవస్థాపకురాలు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. శోభారాజు గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి ఈ శనివారం మధ్యాహ్నం అన్నదానం, సాయంత్రం అన్నమ స్వరార్చన సేవను సభక్తిపూర్వంగా అందించారు. స్వరార్చనలో భాగంగా చి|| అవలూర్ అనఘ కృతి సుస్వరంగా "శ్రీమన్నారాయణ, పొడగంటిమయ్య, పరమపురుష, కులుకక నడవరో, రామచంద్రుడితడు, అదె తాదానే కదవే, కందర్ప జనక, అన్ని మంత్రములు, పొలితి జవ్వనమున, నల్లని మేని, కొలని దోపరికి, ఉయ్యాల బాలునూచెదరు" అనే చక్కటి సంకీర్తనలకు అనఘమైన స్వరాలాపన అందించారు. ఈ చిరంజీవికి మృదంగం మీద సుధాకర్ గారు, వయోలిన్ మీద పాలపర్తి ఆంజనేయులు గారు వాయిద్య సహకారం అందించారు. అనంతరం కళాకారులకు, ముఖ్య అతిథికి అన్నమాచార్య భావనా వాహిని పక్షాన సంస్థ నిర్వాహకులు ఙ్ఞాపికను అందించారు. చివరిగా, శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి అంగనలీరే హారతులతో, పసందైన ప్రసాద నైవేద్యాలతో కార్యక్రమం ఉల్లాసభరితంగా జరిగింది.