గంజాయిపై ఈగల్ ఐ.. ఏపీ ప్రభుత్వం కొత్త మెకానిజం..
గంజాయి దందాకు చెక్ పెట్టడంపై ఏపీలోని కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. గంజాయి గుట్టు తేల్చేందుకు, దాన్ని వేళ్లతో సహా పెకలించేందుకు సెబ్ స్థానంలో కొత్త మెకానిజంను ప్రవేశపెట్టింది. ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ ఫోర్స్ మెంట్ (ఈగల్) ను అందుబాటులోకి తెచ్చింది. గంజాయి, డ్రగ్స్ ను ఉక్కు పాదంతో నియంత్రించేందుకు ఈగల్ దోహదపడనుంది. అమరావతిలో ఈగల్ కేంద్ర కార్యాలయం, జిల్లాల్లో యూనిట్ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ఉత్తర్వులు కూడా జారీ చేశారు.
గతంలో వైసిపి ప్రభుత్వం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను ఏర్పాటు చేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈగల్ ఏర్పాటు చేస్తోంది. అయితే గతంలో ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోకు ప్రత్యేక నియమకాలు చేపట్టలేదు. ఎక్సైజ్ శాఖలోనే కొంతమంది సిబ్బందిని సర్దుబాటు చేశారు. ఇప్పుడు ఈగల్ కోసం పనిచేసేందుకు సిబ్బందిని అలాగే సర్దుబాటు చేయనున్నారు. అమరావతిలో నార్కోటిక్ పోలీస్ స్టేషన్, మిగతా 26 జిల్లాల్లో డిస్ట్రిక్ట్ నార్కోటిక్ సెల్స్ ఏర్పాటు చేస్తూ హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు.
అయితే ఈగల్ లో పనిచేసే యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగులకు 30% అలవెన్స్ ఇవ్వనున్నారు. అదే సమయంలో గంజాయి, డ్రగ్స్ కేసుల విచారణకు విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. ఈగల్ ఫోర్స్ ను అదనపు డీజీ లేదా ఐజి స్థాయి అధికారి పర్యవేక్షిస్తారు. మొత్తం 459 మంది సిబ్బందిని నియమించారు. వీరిలో ఒక ఎస్పీతో పాటుగా అడిషనల్ ఎస్పీ, డీఎస్పీలు కూడా ఉన్నారు.
అమరావతి కేంద్ర కార్యాలయంలో 24 గంటలు సేవలందించే కంట్రోల్ రూమ్, కాల్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. దేశంలో ఎక్కడే ఏ నేరం జరిగినా దాని మూలాలు ఏపీలోనే బయటపడుతున్నాయి. ఫలితంగా ఏపీ బ్రాండ్ ఖరాబవుతోంది. దీన్ని నివారించేందుకు.. ఏపీని సన్ రైజ్ స్టేట్ చేసేందుకు కూటమి సర్కార్ నడుం బిగించింది. దీనిలో భాగంగా పలు మెకానిజాలు ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా గంజాయిపై ఉక్కుపాదం మోపుతోంది.