అనిల్ అంబానీకి ఎదురుదెబ్బ ... మూడేళ్ల పాటు నిషేధం!
అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ లిమిటెడ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రిలయన్స్ పవర్, దాని అనుబంధ సంస్థలపైనా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్‌ఈసీఎల్) మూడేళ్ల పాటు నిషేధం విధించింది. నకిలీ బ్యాంక్ గ్యారెంటీలు సమర్పించినట్లు తేలిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో భవిష్యత్తులో మూడేళ్ల పాటు ఈ కంపెనీ ఎస్‌ఈసీఐ నిర్వహించే బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు వీలుండదు.
ఎస్‌ఈసీఐ జూన్‌లో 1 గిగావాట్ సోలార్ పవర్, 2 గిగావాట్ స్టాండలోన్ బ్యాటరీ ఎనర్జీ సోలార్ సిస్టమ్ కోసం బిడ్లను ఆహ్వానించింది. ఇందులో రిలయన్స్ పవర్ అనుబంధ సంస్థ రిలయన్స్ ఎన్‌యూ బీఈఎస్‌ఎస్ పాల్గొంది. అయితే చివరి రౌండ్ బిడ్డింగ్‌లో ఆ సంస్థ నకిలీ గ్యారెంటీలు అందించినట్లు తమ దర్యాప్తులో తేలిందని ఎస్‌ఈసీఐ తాజాగా ప్రకటించింది. దీంతో ఆ బిడ్డింగ్ ప్రక్రియను నిలిపివేసి, వెంటనే సంస్థపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది.