ASBL Koncept Ambience
facebook whatsapp X

సిలికానాంధ్ర ఆధ్వర్యంలో టెక్సాస్ లో దిగ్విజయంగా అన్నమయ్య సంకీర్తనోత్సవం

సిలికానాంధ్ర ఆధ్వర్యంలో టెక్సాస్ లో దిగ్విజయంగా అన్నమయ్య సంకీర్తనోత్సవం

సిలికానాంధ్ర సంస్థ అమెరికా టెక్సాస్ రాష్ట్రంలోని అలెన్ పట్టణంలో తి.తి.దే. సహకారంతో నిర్వహించిన అన్నమయ్య గళార్చన  అత్యంత వైభవంగా జరిగింది. 6000 మంది పైచిలుకు భారతీయులు గొంతెత్తి గోవింద నామాలతో, అన్నమాచార్య కీర్తనలతో శ్రీవెంకటేశ్వర స్వామిని నుతిస్తూ, గానార్చన చేస్తుంటే క్రెడిట్ యూనియన్ ఆఫ్ టెక్సాస్ ప్రాంగణం తిరుమలగా మారిపోయింది. అన్నమయ్య పాట, ప్రతినోటా అనే నినాదంతో ఆయన కీర్తనలను ప్రజల్లోకి విరివిగా తీసుకువెళ్ళే లక్ష్య సాధనలో విశేషకృషి చేస్తున్న సిలికానాంధ్ర ఇప్పటికే భారతదేశంలో లక్షగళార్చన చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు నెలకొల్పిన సంగతి పాఠకులకు విదితమే. అయితే అమెరికా దేశంలో ఇన్ని వేలమందితో అన్నమయ్య ఉత్సవం చెయ్యడం ఇదే తొలిసారి. 16 వ శతాబ్దపు అన్నమయ్య సంకీర్తనలను నాదార్చన, నాట్యార్చన, గళార్చనలనే మూడు భాగాలుగా 21వ శతాబ్దపు అత్యున్నత సాంకేతికతను మేళవిస్తూ లేజర్ అండ్ లైట్ షోగా ప్రదర్శించడం సిలికానాంధ్ర కర్తవ్యదీక్షకు, కార్యదక్షతకు నిదర్శనం.

అన్నమయ్య వంశీకులు తరతరాలుగా కొలుస్తున్న అన్నమయ్య చెక్క విగ్రహాన్ని ఈ కార్యక్రమం కోసం వారు ప్రత్యేకంగా పంపగా దానిని భక్తి శ్రద్ధలతో పట్టుకుని సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఆనంద్ కూచిభొట్ల ముందు నడవగా, ఆడపడుచులు కోలాట నృత్యం చేస్తుండగా, కార్యకర్తలు జీయర్ సంస్థ వారు పంపిన స్వామివార్ల ఉత్సవవిగ్రహాలను ఉంచిన పల్లకీని భుజాలమీద పెట్టుకుని నడుస్తుండగా, వందలమంది అన్నమయ్య కటౌట్లతో వెంటరాగా, వేద మంత్రోచ్ఛారణల మధ్య ఊరేగింపుగా ఆడిటోరియంలోకి వచ్చిన స్వామి వారిని చూస్తూ మైమరిచిపోయిన వేలమంది ప్రవాస భారతీయభక్తుల గోవిందనామాల సంకీర్తనతో జరిగిన శోభాయాత్ర మాడవీధులను తలపింప చేసింది. ఆ వైభవాన్ని ఈ  కార్యక్రమానికి తమ అమోఘమైన చిత్రకళా నైపుణ్యంతో ఘనమైన, అద్భుతమైన విజువల్స్, శ్రీవారి భారీ చిత్రపటాలు, అన్నమయ్య కటౌట్లు తయారుచేసి అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసిన ఘనత సిలికానాంధ్ర ఉపాధ్యక్షులు ఫణిమాధవ్ కస్తూరి గారికి, మరియు వారితో కలిసి ఆడియో వీడియో విభాగంలో పనిజేసిన జనార్ధన్ గారికి దక్కుతుంది.

అన్నమయ్య మహాబృంద గళార్చనా కార్యక్రమాన్ని సైన్యాధ్యక్షుడిగా ముందుండి నడిపించిన ప్రసాద్ జోస్యుల మాట్లాడుతూ అన్నమాచార్యుల కీర్తనల వైశిష్ట్యాని, విశేషాలను సభికులకు వివరించారు. భారతీయ సంస్కృతిని అమెరికన్ ప్రభుత్వాలు కూడా గుర్తించి, దానికి తగు గౌరవం ఇవ్వడం మనదరం గర్వించదగ్గ విషయమని సిలికానాంధ్ర కార్యకర్త కళ్యాణి తాడిమేటి చెప్తూ టెక్సాస్ రాష్ట్రం అలెన్ నగర మేయర్ కార్యాలయం నుంచి వచ్చిన  ప్రొక్లమేషన్ గురించి చెప్పారు. ఆగష్టు 31వ తేదీని “అన్నమయ్య డే” గా ప్రకటిస్తున్నామని సభకు వచ్చిన మేయర్ ప్రతినిధి సభ్యుల కరతాళధ్వనుల మధ్య ప్రకటించారు. తరువాత వైస్ ప్రెసిడెంట్ రాజు చమర్తి గత 23 సంవత్సరాలుగా సిలికానాంధ్ర చేస్తున్న వివిధ కార్యక్రమాలను అతిధులకు పరిచయం చేశారు. ముఖ్యంగా ప్రవాస తెలుగువారి పిల్లలకోసమే నడుపుతున్న మనబడి గురించి, ఇక్కడి పిల్లలు నేర్చుకునే భారతీయ కళలకు పొట్టి శ్రీరామలు తెలుగు విశ్వవిద్యాలయం పట్టాల ద్వారా ఒక ప్రామాణికతను కల్పించే సంపద కార్యక్రమం గురించి తెలియజేశారు. 

సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు, యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర ప్రెసిడెంట్ డా. ఆనంద్ కూచిభొట్ల అధ్యక్షోపన్యాసం చేస్తూ, భారతీయులు అమెరికాకి వలస వస్తున్న గత శతాబ్దకాలంలో ఎవ్వరూ చెయ్యని సాహసం సిలికానాంధ్ర చేసిందని, భారతీయ విలువలతో సిలికాన్ వ్యాలీ సాంకేతికతని రంగరించి అటు భారతీయ కళలు, భాషలతో పాటూ ఇటు కంప్యూటర్ సైన్సెస్ లో కూడా స్నాతకోత్తర విద్యను అందించే ఏకైక అమెరికన్ యూనివర్సిటీ తమదేనని చెప్పారు. ఇప్పుడు యూనివర్సిటీ అతి త్వరలో మెడికల్ కాలేజీనీ మొదలు పెట్టడానికి కృషి చేస్తోందని, అది సఫలీకృతం కావడానికి అందరి సహాయ సహకారాలు కావాలని కోరారు. ఆ ప్రయత్నానికి వెన్నుదన్నుగా ఉంటున్న యూనివర్సిటీ బోర్డు మెంబర్ డా. ముక్కామల అప్పారావుగారిని సభికులకు పరిచయం చేసి, వారిని సత్కరించారు.       

ఇక కార్యక్రమం వివరాల్లోకి వెళితే తొలుత నాదార్చన కార్యక్రమం వాయులీన విద్వాంసురాలు, పద్మశ్రీ పురస్కార గ్రహీత అవసరాల కన్యాకుమారి తన శిష్యులతో కలసి చేసిన కచేరితో ప్రారంభమయ్యింది. దాదాపు 45 నిమిషాలపాటు జరిగిన ఆ సంగీతధారలో భక్తులు తన్మయులయ్యారు. సిలికానాంధ్ర కార్యవర్గం ఆవిడను సత్కరించి “వాయులీన సామ్రాజ్ఞి” బిరుదు ప్రదానం చేసారు. నాదార్చనలో భాగంగానే జరిగిన ఫణి నారాయణ వీణానాద ప్రదర్శన వినూత్న ధోరణిలో సాగింది. ఆయన వీణ, గిటార్ వాద్యాలను మేళవించి స్వయంగా రూపొందించిన వీటార్ వాద్యం మీద కీర్తనలు వాయించడమే కాక, ఆయనకు వాద్య సహకారం అందించిన రఘు చక్రవర్తి, వికాస్ అచ్యుత రామయ్య, అనఘ అయ్యగారి కూడా నిలబడే తమ వాద్యాలను వినిపించడం విశేషం. నాదార్చన సమయంలో భక్తి పారవశ్యులైన ఆహూతులు తమ సెల్ ఫోన్ లైట్లతో ఆడిటోరియం నింపేస్తూ తమ హర్షాతిరేకాన్ని ప్రకటించారు.  

తరువాత జరిగిన నాట్యార్చనలో, దాదాపు 200 మంది ప్రవాస భారతీయ పిల్లలు అన్నమాచార్య కీర్తనలకు శాస్త్రీయ నృత్యాలను  ప్రదర్శిస్తూ ప్రేక్షకులను అలరించారు. గురువులు హేమ చావలి, పద్మ శొంఠి, స్వప్న గుడిమెళ్ళ, శ్రీదేవిల విద్యార్థులు కూచిపూడి, కృష్ణకుమారి విద్యార్థులు ఒడిస్సీ నృత్యాలు ప్రదర్శించారు. 

చివరిగా గళార్చనలో పారుపల్లి రంగనాథ్, గరిమెళ్ళ అనీలకుమార్ ల నేతృత్వంలో ఆడిటోరియంలో ఉన్న వేలాదిమంది భక్తులు గొంతుకలపగా జరిగిన మహాబృంద గళార్చన ఒక అలౌకికమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది. ఏడు ప్రముఖ అన్నమయ్య సంకీర్తనలను గత కొన్ని నెలలుగా డాలస్ లో ఉన్న ఎందరో ప్రఖ్యాత సంగీత విద్వాంసులు ఎన్నో నగరాలలో వేలాది మంది పిల్లలకు, పెద్దలకు అన్నమయ్య కీర్తనలు నేర్పిస్తూ మహా బృంద గళార్చనకు సిద్ధం చేసారు. ప్రముఖ సంగీత కళాకారులు కృతి భట్, శ్రీనిధి, తన్మయిలు కూడా అలన్ నగరానికి వచ్చి ఈ సప్తగిరి సంకీర్తనలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి మద్దతుగా తి.తి.దే. వారు పంపిన లడ్డూ ప్రసాదాన్ని విచ్చేసిన భక్తులందరికీ పంచారు. వారు పంపిన పట్టువస్త్రాలను కళాకారులకు బహుమతిగా అందించారు. ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని జరపడానికి ఆర్థికసహాయం అందించిన దాతలందరినీ సిలికానాంధ్ర నాయకవర్గం తరఫున భాస్కర్ రాయవరం వేదికమీదకు ఆహ్వానించగా పలువురు సిలికానాంధ్ర నాయకులు వారిని సాదరంగా సత్కరించారు. కళ్యాణి సిద్ధార్థ తెరవెనుక నిలబడి సభను సజావుగా నడిపించగా, శ్రీకాంత్ పప్పు, శ్రీకాంత్ బొర్ర, బాలకిషోర్ పెట్లూరి, రామ సుధీర్ వనపల్లి, సంపత్ కొండ, వెంకట్ ప్రత్తిపాటి, శాంతి కొండ, మురళి గరిమెళ్ళ, వెంకట్ లంక, వాణిశ్రీ అవుతు, దిలీప్ సంగరాజు, సుజన పాలూరి, మన్మథరావు రంగాల, శశి గోటేటి, సతీష్ గుంటి, సాయి కందుల, కిరణ్ సింహాద్రి, నరేంద్ర ఉద్ధరాజు, కేదార్ జోస్యుల, గౌతమ్ కస్తూరి, రామారావు పాలూరి, ప్రియ తనుగుల, శశి గోటేటి మరియు ఎందరో విద్యార్థులు కీలక భూమిక పోషించారు. 

ఈ సభ విజయవంతం అవ్వడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ వైస్ చైర్మన్ దిలీప్ కొండిపర్తి, ప్రసాద్ జోస్యుల పేరు పేరునా తమ కృతజ్ఞతలు తెలియచేసారు. 

మన సంస్కృతి, సంప్రదాయం, సంగీతం, సాహిత్యం, నాట్యం యొక్క విశిష్టతను అమెరికా వేదికగా ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నం చేసిన ఈ అన్నమయ్య మహాబృంద గళార్చనకు అనేక సంస్థలు తమ సహకారాన్ని అందజేసి జయప్రదం చేసారు. కార్యసిద్ది హనుమాన్ సంస్థ, దత్తపీఠం వ్యవస్థాపకులు శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి మరియు శ్రీ బాలస్వామి తమ ఆశీస్సులను తెలియజేశారు. శ్రీమతి జ్యోతి రామడుగు, శ్రీ విశ్వనాథ్ రామడుగుల అధ్యక్షతలో నడుస్తున్న ఇండియన్ ఆక్టేవ్స్ సంస్థ, శ్రీని ప్రభల, ఉమ ప్రభల  అమృత వర్షిణి అకాడమీ సంస్థలు తమ మద్దతును ఇచ్చారు.

కేవలం డాలస్ ఫోర్ట్ వర్త్ మెట్రోపాలిటన్ నుండి మాత్రమే కాక, ఆస్టిన్, హ్యూస్టన్, నగరాలనించి మరియు ఒక్లహోమా, అర్కాన్సాస్, కాలిఫోర్నియా, డెట్రాయిట్, జార్జియా, న్యూజెర్సీ, మొదలగు రాష్ట్రాల నుండి కూడా ప్రవాస భారతీయులు అధిక సంఖ్యలో వచ్చి పాల్గొనడం విశేషం.

 

Click here for Photogallery

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :