ASBL Koncept Ambience
facebook whatsapp X

తెలంగాణపై చంద్రబాబు ఫోకస్...

తెలంగాణపై చంద్రబాబు ఫోకస్...

ఏపీలో బంపర్ మెజార్టీతో కూటమి సర్కార్ ఏర్పడింది. టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి, రాష్ట్రపాలనపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు.. కేంద్రంతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నారు. కూటమి పార్టీ కాబట్టి సహజంగానే మోడీ సర్కార్ నుంచి కూడా తగిన స్పందన ఉండేలా కనిపిస్తోంది. దీనికి తోడు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అండ ఉండనే ఉంది. దీంతో ప్రస్తుతానికి ఏపీలో టీడీపీకి అంతా సానుకూలంగా ఉంది.

ఇక ఇప్పుడు తెలంగాణలో పార్టీ బలోపేతంపైనా చంద్రబాబు ఫోకస్ పెడుతున్నారు. దీనిలో భాగంగా ఎన్టీఆర్ భవన్ కు వచ్చిన చంద్రబాబు..తెలంగాణలో టీడీపీని పునర్నిర్మిస్తామని ప్రకటించారు. పార్టీకి యువ రక్తాన్ని ఎక్కిస్తామని, విద్యావంతులకు అవకాశం ఇస్తామని, మూడు నాలుగు దశాబ్దాలు పార్టీ ఉత్సాహంగా పని చేసేలా సమర్థ నాయకత్వాన్ని తీసుకొస్తామని వెల్లడించారు. తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని వివరించారు.

ఎన్నికల్లో పోటీచేయక పోయినా పెద్దఎత్తున కార్యకర్తలు తరలిరావడం చూస్తుంటే తెలంగాణలో పార్టీ బలం ఏమిటో తెలుస్తోంది. 20 ఏళ్లుగా అధికారంలో లేకున్నా కార్యకర్తల్లో అభిమానం, పట్టుదల ఉంది. తెలుగుజాతి ఉన్నంతవరకు తెలంగాణ గడ్డపై పసుపుజెండా ఎగురుతూనే ఉంటుందన్నారు చంద్రబాబు. మరోవైపు హైదరాబాద్ వచ్చిన చంద్రబాబును.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. వీరంతా గతంలో టీడీపీలో ఉన్నవారే. ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీ సహా పలువురు ఎమ్మెల్యేలు.. చంద్రబాబుతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

అయితే.. ఏపీలో గెలిచిన తర్వాత చంద్రబాబు హైదరాబాద్ వచ్చారని.. అందుకే ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపామన్నారు ఎమ్మెల్యేలు . అయితే వీరు చంద్రబాబును కలవడంతోనే.. వీరంతా పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారంటూ ప్రచారం మొదలై పోయింది. తెలుగు రాష్ట్రాలు రెండూ తనకు రెండు కళ్లని.. ఇరు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతూ ముందుకెళ్లాలని ఆకాంక్షించారు చంద్రబాబు. ఈ దిశగా తాను కూడా కృషి చేస్తానన్నారు. అంతేకాదు.. సమస్యల పరిష్కారంలో ఇచ్చి,పుచ్చుకుంటూ వెళ్తే కచ్చితంగా ఫలితం ఉంటుందన్నారు చంద్రబాబు.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :