ASBL NSL Infratech

చంద్రబాబు చొరవ సరే..! సమస్యలు కొలిక్కి వస్తాయా..?

చంద్రబాబు చొరవ సరే..! సమస్యలు కొలిక్కి వస్తాయా..?

తెలుగు రాష్ట్రాలు విడిపోయి పదేళ్లు పూర్తయింది. అయినా ఇప్పటికీ పలు అంశాలపై చిక్కుముడి వీడలేదు. రెండు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలు ఇప్పటికీ పెండింగ్ లోనే ఉన్నాయి. అంతేకాక.. విభజన చట్టంలోని పలు అంశాలపైన కూడా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే రాష్ట్రాల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. దీంతో ముందు తెలుగు రాష్ట్రాలు కూర్చుని మాట్లాడుకుంటే బాగుంటుందని సూచించింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. కూర్చొని మాట్లాడుకుందాం అని ప్రతిపాదించారు.

2014లో ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. అప్పుడు ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. మొదట్లో కొన్నాళ్లు బాగానే ఉన్నా తర్వాత గ్యాప్ పెరిగింది. దీంతో సమస్యలపై ముందడుగు పడలేదు. ఆ తర్వాత 2019లో ఏపీలో జగన్, తెలంగాణలో కేసీఆర్ అధికార పగ్గాలు చేపట్టారు. అప్పుడు కూడా మొదట్లో బాగానే ఉన్నా తర్వాత వైరం పెరిగిపోయింది. దీంతో రెండు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ఎవరూ చొరవ తీసుకోలేదు. దీంతో పదేళ్లయినా కూడా సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు. అయితే ఇప్పుడు అలా నాన్చొద్దని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇటీవలి ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో పాలనాపగ్గాలు మారాయి. తెలంగాణలో రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు అధికార పీఠాలను కైవసం చేసుకున్నారు. వీళ్లద్దరి మధ్య మంచి సంబంధ బాంధవ్యాలున్నాయి. దీంతో కలిసి కూర్చుంటే సమస్యలకు చెక్ పెట్టవచ్చని అందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. 6న హైదరాబాద్ లో కూర్చొని రెండు రాష్ట్రాల మధ్య సమస్యలపై చర్చించుకుందామని ప్రతిపాదించారు. దీనికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా సుముఖంగానే ఉన్నారు. కాబట్టి 6న హైదరాబాద్ లోని ప్రజా భవన్ లో రెండు రాష్ట్రాల సీఎంల మధ్య చర్చలు జరిగే అవకాశం కనిపిస్తోంది.

విభజనచట్టంలో పలు అంశాలపై ఇప్పటికీ చిక్కుముడి వీడలేదు. ముఖ్యంగా నీటి పంపకాలు, విద్యుత్, ఆర్టీసీ ఆస్తులు, ఉద్యోగుల విభజన.. లాంటి అనేక అంశాలు పరిష్కారం కాలేదు. అయితే వీటిపై ముందుగా రెండు రాష్ట్రాల మధ్య అంగీకారం కుదరాలని కేంద్రం చెప్తోంది. ఇన్నాళ్లూ అలాంటి చర్చలకు ఆస్కారం లేకపోవడంతో వీలు కాలేదు. అయితే ఇప్పుడు చంద్రబాబు, రేవంత్ మధ్య చర్చలు పరిష్కారానికి మార్గం సుగమం చేస్తాయనే నమ్మకం ఉంది. అయితే రెండు రాష్ట్రాలూ తమ ప్రయోజనాలనే కోరుకుంటాయి. ఇలాంటప్పుడు కొన్ని అంశాలపై ఇరువురూ ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకెళ్లినప్పుడే వివాదాలకు చెక్ పడే అవకాశం ఉంటుంది.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :