అటవీశాఖ అమరవీరులకు స్థూపాలు నిర్మించాలి: పవన్ కల్యాణ్
గుంటూరులో పర్యటించిన ఏపీ డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్.. గుంటూరు అరణ్య భవన్ లో జరిగిన అటవీశాఖ అమరవీరుల సంస్మరణ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అటవీ అమరులకు స్థూపాలు నిర్మించి, నివాళులు అర్పిద్దామని పిలుపునిచ్చారు. విధినిర్వహణలో 23 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని తెలియజేశారు. వారిలో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బంది ఉన్నారని తెలిపారు. అమరవీరుల త్యాగాలను ఎప్పటికీ మర్చిపోకూడదని, అటవీ శాఖల బ్లాక్‌లకు అమరుల పేర్లు పెట్టాలని పవన్ సూచించారు. అటవీ శాఖకు సంపూర్ణ మద్దతు అందిస్తామని చెప్పిన ఆయన. తాను అటవీశాఖ తీసుకోవడానికి... అమరవీరుడు పందిళ్లపల్లి శ్రీనివాస్ స్ఫూర్తి అని తెలిపారు. అటవీశాఖ కోసం రూ.5 కోట్ల విరాళం సేకరించి ఇస్తానని హామీ ఇచ్చారు. స్మగ్లర్ల నుంచి అడవుల రక్షణకు ఎలాంటి సహాయ సహకారాలనైనా అందిస్తామన్నారు. అడవుల రక్షణకు అటవీ అధికారులకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నామని చెప్పారు. అటవీశాఖలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని, దీనిపై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు.