అమరావతి నిర్మాణానికి కేటాయించిన నిధుల వినియోగంపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం కేంద్రం రూ.15 వేల కోట్ల నిధులు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ నిధులను ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు ద్వారా అందించేలా కేంద్రం సర్దుబాటు చేసింది. ఈ నిధుల వినియోగానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతి అభివృద్ధి కోసం ప్రణాళికలు అమలు చేయాలని, ముఖ్యంగా, రోడ్లు, జలవనరులకు సంబంధించిన ప్రాజెక్టులు ఈ నిధులతో చేపట్టాలని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అత్యున్నత ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలు, పర్యావరణ హిత నిర్మాణాలు, మెరుగైన ఉపాధి అవకాశాల కోసం ఈ నిధులు వినియోగించాలని సూచించింది. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి నిధులు అందుకునేందుకు సీఆర్డీయే కమిషనర్‌కు అధికారాలు కల్పించింది. ఈ మేరకు ఏపీ మున్సిపల్ శాఖ స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ జి.అనంతరాము పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి.