ASBL NSL Infratech
facebook whatsapp X

వైసీపీలో వైట్ పేపర్ టెన్షన్...

వైసీపీలో వైట్ పేపర్ టెన్షన్...

ఏపీ సీఎం చంద్రబాబు... పాలన, రాజకీయ, రాజకీయేతర అంశాలకు సంబంధించి వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడా ఎలాంటి గ్యాప్ లేకుండా చూసుకుంటున్నారు. ఓవైపు ఢిల్లీ పెద్దలతో సత్సంబంధాలు పెట్టుకుని.. రాష్ట్రాభివృద్ధికి నిధులు వచ్చేలా చూసుకోవడంతో పాటు, రాష్ట్రంలో గత ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతిని తవ్వి తీస్తున్నారు. ఒక్కో రంగంపై శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. అంతేకాదు.. అందులోని అవినీతిని సభలో వివరిస్తూ.. విచారణకు సైతం ఆదేశిస్తున్నారు.

ముఖ్యంగా గత ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లుగానే అవినీతికి పాల్పడిన వారిని చట్టపరంగా శిక్షిస్తామన్న చంద్రబాబు ప్రభుత్వం.. ఆదిశగా వేగంగా అడుగులేస్తోంది. ఈ క్రమంలో గత ప్రభుత్వ విధానాలు, వాటి ఉద్దేశ్యం, ఎవరు లబ్ధి పొందారు, ఎలా లబ్ధి పొందారు లాంటి అంశాలను సభలో ఎమ్మెల్యేలకు వివరించారు చంద్రబాబు. ముఖ్యంగా ఇసుక, గనులు, లిక్కర్ అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. వీటన్నింటిలోనూ వైసీపీ నేతల పేర్లు ప్రధానంగా చర్చకు వస్తున్నాయి.

ఈపరిణామాలు వైసీపీ నేతల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. గతంలో స్కిల్ డెవలప్ మెంట్ కేసులో నాడు విపక్షనేతగా ఉన్న చంద్రబాబును 50 రోజులకు పైగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచారు. ఇప్పుడు దాని ఎఫెక్ట్ కచ్చితంగా ఉంటుందని వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఫలితంగా అవినీతిలో తమ ప్రమేయం ఉందని తేలితే కచ్చితంగా తమకు శిక్ష తప్పదన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. ఇక వైసీపీలో ఉండే అగ్రనేతలు సైతం.. ఈ విషయంలో ఆందోళన చెందుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో కొంతమంది ఎమ్మెల్యేలు ఎందుకొచ్చిన సంతరా బాబూ అనుకుంటూ పార్టీని వదిలిపెడుతున్నారన్న చర్చ తెరమీదకు వచ్చింది. ఈ విచారణల నుంచి బయటపడాలంటే అయితే అధికార కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరాల్సి ఉంది.

టీడీపీలో ఇప్పటికే కీలకమైన వ్యక్తులకు అవకాశం లభించింది. మరికొందరికి టీడీపీ విధానాలు నచ్చవు. చంద్రబాబుపై నేరుగా విమర్శలు చేసిన సందర్భాలున్నాయి. వారు జనసేన వైపు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే జనసేన సైతం ఇదే అదనుగా కాస్త పర్వాలేదు అనుకున్న వారిని పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తోందన్న అభిప్రాయం కనిపిస్తోంది. ఇక మిగిలిన వారికి కమలమే దిక్కు. అయితే వారు కేసుల్లో ఉన్నవారిని తీసుకుంటారా...? ఆ విషయంలో కూటమి పార్టీలతో చర్చించాల్సి ఉంటుంది. మరి ఏం జరుగుతుందన్న చర్చ ఆ పార్టీ నేతల్లో ఆఫ్ ద టాక్ గా వినిపిస్తోంది.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :