AP Roads : ప్రైవేటు చేతుల్లోకి రోడ్లు.. చంద్రబాబు తప్పు చేస్తున్నారా..?
సంస్కరణ అమలులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందుంటారనే విషయం అందరికీ తెలుసు. తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన దేశంలోనే తొలిసారి విద్యుత్ సంస్కరణలు అమలు చేశారు. అప్పట్లో ఆయనపై అనేక విమర్శలు వచ్చినా వెనక్కు తగ్గలేదు. అవి తదనంతర కాలంలో సత్ఫలితాలిచ్చాయి. అలాగే ఐటీని అందిపుచ్చుకోవడంలో కూడా ఆయన ముందు నిలిచారు. ఆ రంగంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎంతటి పురోగతి సాధించింతో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏపీలో రోడ్లను ప్రైవేటీకరించాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. అయితే ఈ విషయంలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.
ఆంధ్రప్రదేశ్ లో గత ఐదేళ్లూ వైసీపీ అధికారంలో ఉంది. ఆ సమయంలో రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయనే ఆరోపణలున్నాయి. గుంతల రోడ్లు అడుగడుగునా దర్శనమిచ్చాయి. కొత్త రోడ్లు వేయకపోవడం, పాడైపోయిన రోడ్ల మరమ్మత్తులను పట్టించుకోకపోవడంతో జగన్ సర్కార్ అనేక విమర్శలు ఎదుర్కొంది. ఎన్నికల్లో ఇది కూడా ఒక ప్రధాన అంశంగా నిలిచింది. అందుకో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రోడ్ల మరమ్మత్తులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. సంక్రాంతిలోపు పాడైపోయిన రోడ్ల మరమ్మతులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది. ప్రస్తుతం ఈ పనులు చురుగ్గా సాగుతున్నాయి.
అయితే రోడ్ల నిర్వహణ ప్రభుత్వానికి పెనుభారంగా మారుతోంది. కాంట్రాక్టర్లు సరిగా రోడ్లు వేయకపోవడంతో అవి కొంతకాలానికే పాడైపోతున్నాయి. దీంతో ప్రభుత్వంపై మళ్లీ భారం పడుతోంది. అందుకే రాష్ట్ర రహదారులను కూడా జాతీయ రహదారుల మాదిరిగా ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే బాగుంటుందని చంద్రబాబు నిర్ణయించారు. గ్రామీణ రోడ్ల మొదలు మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి రోడ్ల వరకూ.. అన్నింటినీ పీపీపీ పద్ధతిలో అప్పగించాలని చూస్తున్నారు. ఇలా చేయడం ద్వారా రోడ్ల నిర్వహణ బాధ్యతలను ఆయా సంస్థలు చూసుకుంటాయి. రోడ్లు బాగాలేవనే ఫిర్యాదులు ఉండవు. ప్రయాణికులకు ఇబ్బందులు తప్పుతాయి.
ఇంతవరకూ బాగానే ఉంది. అయితే ఇలా ప్రైవేటు అప్పగించిన రోడ్లలో టోల్ ఛార్జీలను వసూలు చేయనున్నారు. ఇదే ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. టూవీలర్లు, ఆటోలు, ట్రాక్టర్లు మినహా మిగిలిన వాహనాలన్నింటి నుంచి టోల్ వసూలు చేయాలని భావిస్తున్నారు. దీన్ని కూటమి పార్టీలు స్వాగతిస్తున్నాయి. కానీ వైసీపీ సహా ప్రజలు చాలా మంది ఈ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. రవాణా సౌకర్యాలను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కానీ ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేసి వాటిని నిర్వహించాలనుకుంటోంది. ఇప్పటికే జాతీయ రహదారులపైకి ఎక్కితే టోల్ ఛార్జీలతో జేబులు ఖాళీ అవుతున్నాయనే విమర్శలున్నాయి. ఇప్పుడు గ్రామీణ రోడ్లు ఎక్కినా టోల్ కట్టాల్సి రావడం అంటే ప్రజల జేబులు గుల్ల చేయడమే. ఇది కచ్చితంగా టీడీపీకి భవిష్యత్తులో ఇబ్బందులు తెచ్చే ప్రమాదం కనిపిస్తోంది.