అప్పుల ఊబిలో ఆంధ్ర.. దీనికి కారకులు ఎవరు?
ఆంధ్రా అప్పుల కుప్పగా మారింది అన్న విషయం ఎన్నికల ముందు నుంచి కూటమి ప్రభుత్వం చెబుతూ వస్తోంది. అయితే మరో పక్క తమ హయాంలో చేసిన అప్పు చాలా తక్కువ అంటూ వైసీపీ బలంగా వాదిస్తోంది. దీంతో వైసీపీ, టీడీపీ మధ్య ఈ అప్పుల విషయంలో వాదోపవాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. కాసేపు ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం ఏపీలో ఉన్న అప్పు ఎంత అన్న లెక్క మాత్రం అంత ఈజీగా తేలేలా కనిపించడం లేదు. వివిధ ఏజెన్సీలు తేల్చిన లెక్కలకు అధికారికంగా చూపిస్తున్న లెక్కలకు పొంతన కనిపించడం లేదు. దీంతో అసలు ఏపీలో ఉన్న అప్పు ఖాతా ఎంత అన్న విషయంపై తీవ్ర చర్చ జరుగుతుంది.
ఈ నేపథ్యంలో కాంగ్ నివేదిక ప్రకారం ప్రస్తుతం ఆంధ్రాలో అప్పు అక్షరాల 4,38, 278 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది. అసలు మండలి లో ఈ కాంగ్ నివేదికను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా ఏపీ అప్పుల గురించి కూడా ఆయన సభకు తెలియజేశారు. గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ఏపీ లో అప్పులు పెరిగిపోయాయి అని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. అన్ని విభాగాలలో బకాయిలు పెట్టి వైసీపీ సక్క దిగిపోయిందని.. దీంతో అధికారంలోకి వచ్చిన కూటమిపై భారం అంతా పడుతోందని ఆయన ఆరోపించారు. టిడ్కో లబ్ధిదారులకు పాతిక వేల రూపాయలు ఇస్తాము అని చెప్పి బకాయి పెట్టారు అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని నిందించారు. అంతేకాదు ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా నిధులను మళ్ళించారని , జగన్ హయాంలో అప్పులు బాగా పెరిగాయని అన్నారు.
అప్పు ఎవరు చేశారు అనే విషయం పక్కన పెడితే మొత్తానికి భారం మాత్రం రాష్ట్రంలో ప్రజల పైనే పడుతుంది. అనవసరమైన పథకాలు, ఉచితాలు చూపించి ఎన్నికల్లో గెలవడం కోసం నాయకులు చేసే హడావిడి కి ఇలా అడ్డంగా చివరికి ప్రజలే బుక్ అవుతున్నారు. అప్పు ఎంత ఉందో అన్న విషయాన్ని మాట్లాడడానికి ఇచ్చే ప్రాధాన్యత దాన్ని ఎలా తీర్చాలి.. భవిష్యత్తులో అది పెరగకుండా ఎలా నిరోధించాలి అనే విషయంపై మన పాలకులు ఎప్పుడైతే దృష్టి పెడతారో అప్పుడే ఈ అప్పుల బాధ వదిలేలా కనిపిస్తోంది.