RGV : పరారీలో రామ్ గోపాల్ వర్మ..! అరెస్టు ఖాయమా..?
ఆంధ్రప్రదేశ్ లో సోషల్ మీడియాలో విపరీత పోస్టులు పెట్టిన వాళ్లపై కొరడా కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు సోషల్ మీడియా సైకోలను పోలీసులు అరెస్టు చేశారు. పలువురికి నోటీసులు ఇచ్చి వదిలేశారు. మరికొందరిని జైళ్లకు పంపించారు. ఇంకొందరిని విచారణ జరుపుతున్నారు. ఈ కోవలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను కూడా పోలీసులు విచారణకు పిలిచారు. అయితే విచారణకు హాజరు కాకుండా వర్మ తప్పించుకుంటున్నారు. దీంతో ఆయన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు వెతుకుతున్నారు. ఆయన్ను ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం కనిపిస్తోంది.
రామ్ గోపాల్ వర్మ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ టార్గెట్ గా సోషల్ మీడియాలో పలు పోస్టులు పెట్టారు. వీటిపై చర్యలు తీసుకోవాలని గతంలోనే ఫిర్యాదులు అందాయి. అయితే అప్పటి ప్రభుత్వం స్పందించలేదు. ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వర్మపై పలువురు ఫిర్యాదులు చేశారు. వాటిని బుక్ చేసిన పోలీసులు విచారణకు రావాలని వర్మకు ఆదేశించారు. 19న విచారణకు రావాలని ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే తాను షూటింగుల్లో బిజిగా ఉన్నందున రాలేనని.. కొంత సమయం ఇవ్వాలని కోరారు.
అంతకుముందు.. పోలీసులు నోటీసులు ఇవ్వగానే తన కేసు కొట్టేయాలని ఆదేశాలివ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఇందుకు హైకోర్టు నిరాకరించింది. ఒకవేళ అరెస్టు చేస్తారనే భయం ఉంటే బెయిల్ పిటిషన్ వేయాలని సూచించింది. అదే సమయంలో విచారణకు గడువు కావాలంటో పోలీసులనే అడగాలని తేల్చి చెప్పింది. దీంతో తనకు కాస్త గడువు కావాలని పోలీసులకు వాట్సాప్ మెసేజ్ పంపించారు. అదే సమయంలో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో పోలీసులు ఈ నెల 25న విచారణకు రావాలని ఆదేశించారు. వాస్తవానికి ఇవాళ వర్మ విచారణకు హాజరు కావాల్సి ఉంది.
అయితే వర్మ ఇవాళ కూడా విచారణకు హాజరు కాలేదు. దీంతో ప్రకాశం జిల్లా పోలీసులు హైదరాబాద్ లోని వర్మ కార్యాలయానికి వచ్చారు. అయితే వర్మ అందుబాటులో లేరు. షూటింగుల్లో బిజీగా ఉన్నారని ఆయన తరపు న్యాయవాది పోలీసులకు వివరించారు. దీంతో పోలీసులు వర్మ ఆచూకీకోసం ఆరా తీస్తున్నారు. ఆయన ఫోన్ స్విచ్చాఫ్ వస్తోంది. సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాండ్లింగ్ మాత్రం హైదరాబాద్లోనే చూపిస్తోంది. శంషాబాద్ సమీపంలోని ఓ ఫాంహౌస్ లో వర్మ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో ఆయన్ను ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం కనిపిస్తోంది. హైకోర్టులో వేసిన ముందస్తు బెయిల్ పై ఇంకా తీర్పు రాలేదు. ఈలోపు విచారణకు కూడా వర్మ హాజరు కాలేదు. దీంతో ఆయన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.