RGV: లాజిక్కులతో పోలీసులకు చుక్కలు చూపిస్తున్న వర్మ..!!
రామ్ గోపాల్ వర్మ వ్యక్తిత్వం ఎలాంటిదో అందరికీ తెలుసు. పదిమందీ ఒక దారిలో నడుస్తుంటే తను మాత్రం ఇంకో దారిలో నడుస్తుంటాడు. తను వెళ్తున్న దారే కరెక్ట్ అంటాడు. ఎందుకు కరెక్టో తనదైన వాదనలతో నిజమని నమ్మించగలరు కూడా..! అంతటి శక్తిమంతుడు ఆర్జీవీ. ఇప్పుడు సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టారంటూ ఆయనపై ఆంధ్రప్రదేశ్ లో కేసులు నమోదయ్యాయి. విచారణకు హాజరు కాకుండా తప్పించుకుంటూ ఉండడంతో వర్మను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఆయన పోలీసులకు దొరక్కుండా దాక్కుంటున్నారు. అయినా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ తనను పట్టుకోండి చూద్దాం అంటూ సవాళ్లు విసురుతున్నారు.
ఈనెల 19న రామ్ గోపాల్ వర్మ ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ కు హాజరు కావాల్సి ఉంది. అయితే షూటింగులో బిజీగా ఉన్నందున సమయం కావాలని కోరారు. దీంతో 25న రావాలని పోలీసులు సూచించారు. అయితే 25న కూడా వర్మ హాజరు కాలేదు. అదే రోజు హైదరాబాద్ లోని వర్మ డెన్ కు పోలీసులు వచ్చారు. అక్కడ వర్మ లేరు. షూటింగులో బిజీగా ఉన్నారని ఆయన తరపు న్యాయవాది వెల్లడించారు. అప్పటి నుంచి పోలీసులు ఏపీ, తెలంగాణ, తమిళనాడుల్లో వర్మ కోసం గాలిస్తున్నారు. ఆయన ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుండడంతో ఆచూకీ కనుక్కోవడం ఇబ్బందిగా మారింది. అయితే ఇంతలోనే వర్మ పెద్ద ట్విస్ట్ ఇచ్చారు.
రామ్ గోపాల్ వర్మ మీడియాలో ప్రత్యక్షమయ్యారు. తాను ఎక్కడికీ పారిపోలేదని.. తనది అలాంటి వ్యక్తిత్వం కాదని స్పష్టం చేశారు. తాను డెన్ లోనే ఉన్నానని వెల్లడించారు. పోలీసులు డెన్ లోపలికి రాలేదని.. బయట నుంచి అటే వెళ్లిపోయారని చెప్పారు. తను పెట్టిన పోస్టులకే అరెస్టు చేయాల్సి వస్తే.. దేశంలో లక్షలాది మందిని అరెస్టు చేయాల్సి ఉంటుందన్నారు. తన పోస్టులు సెటైరికల్ గా ఉంటాయే కానీ ఎవర్నీ కించపరిచేలా ఉండవన్నారు. అయినా తనకు పోలీసులు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్న సెక్షన్లేవీ తనను అరెస్టు చేసేందుకు వీలు కల్పించేవి కావన్నారు. ఈ వ్యవహారాన్ని కోర్టులోనే తేల్చుకుంటానన్నారు. ఒకవేళ తాను తప్పు చేసి ఉంటే జైలుకు వెళ్తాను తప్ప ఎవరి మనోభావాలో దెబ్బతిన్నాయని సారీ చెప్పబోనని స్పష్టం చేశారు.
రామ్ గోపాల్ వర్మ వ్యవహారం పోలీసులకు పెద్ద సవాల్ గా మారింది. పోలీసులు వచ్చినప్పుడు చిక్కట్లేదు. మరోవైపు మీడియా ముందు ప్రత్యక్షమై ఇంటర్వ్యూల మీద ఇంటర్వూలు ఇస్తున్నారు. పోలీసులు చేతకాని వాళ్లనేలా వర్మ ఎత్తి చూపే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ రామ్ గోపాల్ వర్మ టోన్ లో ఏమాత్రం మార్పు రాలేదు. మరింత రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారు. దీంతో రామ్ గోపాల్ వర్మను ఎలాగైనా అరెస్టు చేయాలనే పట్టుదలతో ఉన్నారు పోలీసులు. ఇప్పటికే ఆయన ఆచూకీని పోలీసులు కనిపెట్టినట్టు సమాచారం. కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయకపోతే నేడో, రేపో వర్మను పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది.