Pushpa 2 : పుష్ప చుట్టూ తిరుగుతున్న ఏపీ రాజకీయాలు..!
ఆంధ్రప్రదేశ్ లో సినిమాలకు, రాజకీయాలకు విడదీయరాని అనుబంధం ఉంది. ఆ రెండింటినీ విడదీసి చూసే పరిస్థితి కూడా లేదు. ఎప్పుడు ఎవరు ఎక్కడ ఉంటారో అర్థం కాదు. సినీరంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి సంచలనాలను సృష్టించిన వాళ్లున్నారు. అలాగే ఇండస్ట్రీ అండదండలకోసం పాకులాడే రాజకీయ పార్టీలు, నేతలు కూడా ఉన్నారు. అందుకే వాటి మధ్య బంధం బలమైనది. ఇప్పుడు అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చుట్టూ ఏపీ రాజకీయం తిరుగుతున్నట్టు కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అల్లు అర్జున్ సినిమా ఇప్పుడు పొలిటికల్ ట్విస్టుల్లో ఇరుక్కుంది.
అల్లు అర్జున్ మెగా కాంపౌండ్ వ్యక్తి అనే విషయం తెలుసు. అయితే ఎన్నికల ముందు అల్లు అర్జున్ తన స్నేహితుడైన వైసీపీ నేత శిల్ప రవిచంద్రారెడ్డి ఇంటికెళ్లి మద్దతు ప్రకటించారు. ఇది అప్పట్లో పెద్ద సంచలనమే అయింది. నంద్యాలలో ఆయనపై కేసు కూడా నమోదైంది. ఇటీవలే దాన్ని హైకోర్టు కొట్టేసింది. అల్లు అర్జున్ వైసీపీకి ఎక్కడా మద్దతు ప్రకటించలేదు. అయితే అల్లు అర్జున్ వైసీపీ నేతకు మద్దతివ్వడాన్ని జనసైనికులు అస్సలు జీర్ణించుకోలేదు. నాగబాబు కూడా అప్పట్లో చేసిన ఓ ట్వీట్ పెద్ద దుమారమే రేపింది. అప్పటి నుంచి అల్లు ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి మధ్య గ్యాప్ వచ్చింది. ఇప్పటికీ అది అలాగే కొనసాగుతోంది. పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. చిరంజీవి ఇంట్లో ఆయనకు పెద్ద సన్మానం జరిగింది. అయినా అల్లు ఫ్యామిలీ మాత్రం ఎక్కడా కనిపించలేదు.
ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 విడుదలకు సిద్ధమవుతోంది. దీనిపై జనసైనికులు సోషల్ మీడియాలో పెద్ద సెటైర్లు వేస్తున్నారు. పాట్నా, చెన్నైలలో ఇటీవల పుష్ప ప్రీరిలీజ్ ఈవెంట్లు జరిగాయి. వీటిలో అల్లు అర్జున్ యాటిట్యూడ్ పై అనేక జోకులు పేల్చుతున్నారు. మెగా ఫ్యామిలీతో పెట్టుకుంటో ఏం జరుగుతుందో అర్థమవుతుందంటూ కొందరు బెదిరిస్తున్నారు కూడా..! ఆహా అన్ స్టాపబుల్ లో కూడా పవన్ కల్యాణ్ పై అల్లు అర్జున్ పాజిటివ్ గా మాట్లాడలేదు. దీంతో జనసైనికులకు మరింత ఆగ్రహం తెప్పించింది. దీంతో పుష్ప సినిమాను ఫెయిల్ చేయాలనే ఉద్దేశంతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ గట్టిగా ట్రై చేస్తున్నారు.
అయితే అల్లు అర్జున్ కు వైసీపీ పూర్తి మద్దతుగా ఉంటోంది. వాస్తవానికి వైసీపీకి బన్నీ ఏనాడూ బహిరంగంగా మద్దతు తెలపలేదు. అయితే వైసీపీ నేతకు మద్దతివ్వడం ద్వారా అల్లు అర్జున్ ఇబ్బందుల్లో ఉన్నాడని గ్రహించింది వైసీపీ. అందుకే పుష్పరాజ్ సినిమా చూసేందుకు తామంతా ఎదురు చూస్తున్నట్టు వైసీపీ నేత అంబటి రాంబాబు బహిరంగంగానే వెల్లడించారు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు ఇబ్బందులు పెట్టేందుకు నందమూరి ఫ్యామిలీ ప్రయత్నించి విఫలమైందని.. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాను మెగా ఫ్యామిలీ కూడా ఏం చేయలేదని అంబటి రాంబాబు చెప్పారు. దీన్నిబట్టి అల్లు అర్జున్ ఇటు జనసేన, అటు వైసీపీ మధ్యలో ఇరుక్కుపోయినట్లు అర్థమవుతోంది.