దేశంలోనే తొలిసారి .. ఏపీ నుంచి ఆరంభం : సీఎం చంద్రబాబు
భవిష్యత్ అంతా పర్యాటకానిదే అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. భవిష్యత్‌లో ఏ ఇజం ఉండదు, టూరిజం ఒక్కటే ఉంటుందని పేర్కొన్నారు. దేశంలో తొలిసారి పర్యాటకంగా సీ ప్లేన్ వినియోగం ఏపీ నుంచి ఆరంభం కానుంది. సీప్లేన్ పర్యాటకాన్ని చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. విజయవాడలోని పున్నమిఘాట్ నుంచి శ్రీశైలం వరకు సీఎం చంద్రబాబు, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, పలువురు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఇందులో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ తక్కువ సమయంలోనే అత్యున్నత స్థానానికి ఎదిగిన వ్యక్తి రామ్మోహన్ నాయుడు అని కేంద్ర మంత్రివర్గంలో అత్యంత యువకుడాయన అని కొనియాడారు. సీప్లేన్ ప్రయాణం వినూత్న అవకాశమిది. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి. సంపద సృష్టిస్తేనే ఆదాయం పెరుగుతుంది. సాంకేతికత చాలా వేగంగా పెరుగుతోంది. దానిని పూర్తిగా వినియోగించుకోవాలి. ఐటీ అంటే ఆనాడు ఎగతాళి చేశారు. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చూసినా మనవాళ్లే ఉన్నారు. అనునిత్యం కొత్త ఆలోచనలు చేయాలి. రాబోయే రోజుల్లో విమానాశ్రయాలే కాకుండా సీప్లేన్ ద్వారా రవాణా సౌకర్యం లభిస్తుంది అని అన్నారు.
రాష్ట్రంలో విధ్వంసమైన వ్యవస్థను బాగుచేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం. ఎంత త్వరగా అనుకున్న ప్రగతిని సాధించాలనేదే ఆలోచిస్తున్నాం. గాడితప్పిన పరిపాలనను సరిచేయడమే నా లక్ష్యం. రాష్ట్రంలోని రోడ్లను చూసి అవహేళన చేశారు. పొగొట్టిన బ్రాండ్‌ను తిరిగి తీసుకొచ్చే బాధ్యత తీసుకున్నాం. ప్రజలు గెలవాలి. ఎన్డీయేకు ఓటేయాలని నేను, పవన్, నరేంద్ర మోదీ కోరాం. ఏపీ ప్రజలు గెలిచారు. మన రాష్ట్రాన్ని నిలబెట్టారు. వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రానికి ప్రజలు ఆక్సిజన్ ఇచ్చారు అని చంద్రబాబు పేర్కొన్నారు.