Adani : అదానీపై అమెరికాలో కేసు.. జగన్ మెడకు చుట్టుకోబోతోందా..!?
అమెరికాలో అదానీ గ్రూప్ పై కేసు నమోదు కావడం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనానికి కారణమవుతోంది. అదానీకి మోదీ ప్రభుత్వం మేళ్లు చేస్తోందని కాంగ్రెస్ మొదటి నుంచీ ఆరోపణలు చేస్తూ వస్తోంది. ఇప్పుడు మరోసారి ఇదే అంశాన్ని లేవనెత్తుతోంది. ఇప్పటికైనా పార్లమెంట్ జాయింట్ కమిటీ ఏర్పాటు చేసి అదానీపై విచారణ చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని పక్కన పెడితే అమెరికాలో అదానీపై నమోదైన కేసు దేశంలో పలు రాష్ట్రాల మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది. ముఖ్యంగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ అధికారంలో ఉన్నప్పుడు అదానీతో డీల్ కుదిరింది. ఇందుకోసం జగన్ సహా పలువురు ఏపీ అధికారులకు భారీగా ముట్టచెప్పినట్లు అమెరికా FIRలో నమోదు చేసింది.
అదానీ గ్రూప్ దేశంలో పేరొందిన ప్రముఖ వ్యాపార సంస్థ. అనేక రంగాల్లో అదానీ గ్రూప్ వ్యాపారాలు చేస్తోంది. అందులో ఎనర్జీ సెక్టార్ కూడా ఒకటి. సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే సోలార్ పవర్ లో కూడా అదానీ భారీగా పెట్టుబడులు పెట్టింది. ఇదంతా అదానీ గ్రీన్ ఎనర్జీ ద్వారా నడుస్తుంది. ఇందులో భాగంగా తమ కంపెనీల నుంచి విద్యుత్ కొనుగోలు చేసేలా పలు రాష్ట్రాలతో అదానీ గ్రూప్ ఒప్పందం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, బీహార్ లాంటి రాష్ట్రాలు అదానీ గ్రీన్ ఎనర్జీతో ఒప్పందాలు చేసుకున్నాయి. అయితే ఈ ఒప్పందాలను దక్కించుకునేందుకు అదానీ భారీ ఎత్తున లంచాలు ఇచ్చారనేది అమెరికన్ ప్రాసెక్యూటర్లు చేస్తున్న ఆరోపణ.
ఇండియాలో అదానీ గ్రూప్ లంచాలిచ్చి కాంట్రాక్టులు దక్కించుకుంటే అమెరికాకు ఏంటి ప్రాబ్లమ్ అనే సందేహాలు రావచ్చు. అదానీ గ్రూప్ తమ సామ్రాజ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. అందులో భాగంగా వివిధ దేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షిస్తోంది. అదానీ గ్రీన్ ఎనర్జీ కోసం ప్రపంచవ్యాప్తంగా 700 మిలియన్ డాలర్ల పెట్టుబడులను స్వీకరించింది. ఇందులో 175 మిలియన్ డాలర్లు అమెరికా పెట్టుబడిదారులవి. భవిష్యత్తులో భారీ లాభాలు వచ్చే అవకాశం ఉందని వీళ్లను నమ్మించింది. అందుకే ఇప్పుడు అమెరికా ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇలాంటి అక్రమ మార్గాల ద్వారా వ్యాపారం చేయడం ద్వారా అమెరికన్ పెట్టుబడి దారులను అదానీ మోసం చేశారని, వాళ్లకు నష్టం చేకూర్చారని అమెరికా పెడరల్ ఇన్వెస్టిగేటవ్ ఏజెన్సీ ఆరోపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ విషయాన్ని అమెరికన్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ప్రత్యేకంగా ప్రస్తావించింది. 7వేల మెగావాట్ల విద్యుత్ డీల్ కు గానూ అప్పటి ముఖ్యమంత్రి జగన్.. ఒక్కో మెగా వాట్ కు రూ.25 లక్షల చొప్పున మొత్తం రూ.1750 కోట్లు తీసుకున్నట్టు ఆరోపించింది. ఇదిప్పుడు నాటి జగన్ ప్రభుత్వ మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది. ఈ అంశంపై విచారణ జరపాలని రాహుల్ గాంధీ చేసిన డిమాండ్ కు బీజేపీ సమాధానమిచ్చింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటివి జరగలేదని.. అప్పుడు ఏపీలో ఉన్నది వైసీపీ అని, ఒడిశాలో ఉన్నది కాంగ్రెస్ మిత్రపక్షమైన బీజేపీ అని సమాధానమిచ్చింది.
మరోవైపు.. అమెరికాలో లంచం ఆరోపణల కేసుపై అదానీ గ్రూప్ స్పందించింది. US డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ ఆరోపణలు నిరాధారామని కొట్టిపారేసింది. ఇవి కేవలం ఆరోపణలు మాత్రమేనని.. నిరూపితమయ్యే వరకు దోషులు కాదని US డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ ప్రకటనలోనే ఉందని వివరించింది. పూర్తి పారదర్శకతతో నియంత్రణ సంస్థల నిబంధనలను పాటిస్తున్నామని తెలిపింది. చట్టాలను గౌరవిస్తూ.. చట్ట ప్రకారమే నడుచుకుంటామని భాగస్వాములు, వాటాదారులు, ఉద్యోగులకు చెప్పామని గుర్తు చేసింది. అదానీ గ్రూప్ చెప్పినట్లు ఇప్పటికైతే ఇవన్నీ ఆరోపణలు మాత్రమే.