Balineni : జనసేన తరపున ఎమ్మెల్సీ కాబోతున్న బాలినేని..!?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకాశం జిల్లాకు కొంత ప్రత్యేకత ఉంటుంది. ఆ జిల్లా నేతలు ఏ పార్టీలో ఉన్న తమదైన శైలిలో చక్రం తిప్పేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. వైసీపీ, టీడీపీ, జనసేన.. ఇలా పార్టీలేవైనా జిల్లాలో పట్టుకోసం నేతలు గట్టిగానే ప్రయత్నిస్తూ ఉంటారు. ఇప్పుడు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి కూడా ఇదే ప్రయత్నాల్లో ఉన్నట్టున్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ రంగప్రవేశం చేసిన బాలినేని శ్రీనివాస రెడ్డి వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడిగా ఉండేవారు. జగన్ పార్టీ పెట్టిన తర్వాత కాంగ్రెస్ కు రాజీనామా చేసి ఆయన వెంట నడిచారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్ కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు.
అయితే మూడేళ్ల తర్వాత తనను మంత్రివర్గం నుంచి తప్పించడంతో బాలినేని జీర్ణించుకోలేకపోయారు. అదే సమయంలో పార్టీలో ఇతర నేతలు జిల్లాలో పెత్తనం చెలాయిస్తుండడం., తన మాటకు విలువ లేకుండా పోవడంతో తన అసంతృప్తిని బాహాటంగానే వెలిబుచ్చారు. తాజా ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. దీంతో బాలినేని శ్రీనివాస రెడ్డి వైసీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు. ఇప్పుడు జనసేనలో బాలినేనికి ఎలాంటి పదవి అప్పగిస్తారనేది తెలియట్లేదు. అయితే త్వరలోనే బాలినేనిని చట్టసభలకు పంపించేందుకు రంగం సిద్ధమవుతోందనే టాక్ జిల్లాలో వినిపిస్తోంది.
బాలినేని శ్రీనివాస రెడ్డికి ప్రస్తుతం ఎలాంటి పదవీ లేదు. కేవలం జనసేన నేత మాత్రమే. పార్టీలో కూడా ఆయనకు ప్రాధాన్యత ఉన్న పోస్టు ఏమీ లేదు. ఇప్పట్లో ఎన్నికలు కూడా జరిగే అవకాశం లేదు. కానీ బాలినేని మాత్రం తనకు పదవి కావాలని, జిల్లాలో చక్రం తిప్పాలని తహతహలాడుతున్నారు. ఇందుకోసం ఆయన తెరవెనుక పెద్ద ప్రయత్నాలే సాగిస్తున్నట్టు తెలుస్తోంది. వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న జయమంగళ వెంకటరమణ త్వరలోనే ఆ పార్టీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఆయన పార్టీలో చేరాలంటే కచ్చితంగా పదవికి రాజీనామా చేసి రావాల్సి ఉంది.
జయమంగళ వెంకటరమణ పార్టీకి, పదవికి రాజీనామా చేసి జనసేనలో చేరతారు. అప్పుడు ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన ఆయన స్థానం ఖాళీ అవుతుంది. దానికి జనసేన తరపున బాలినేని శ్రీనివాస రెడ్డి బరిలో దిగబోతున్నారు. ఇదీ ఇప్పుడు జిల్లాలో జరుగుతున్న ప్రచారం. జయమంగళ వెంకటరమణ చేత రాజీనామా చేయించడం, పార్టీలోకి తీసుకురావడం.. లాంటి వ్యవహారాలన్నింటినీ బాలినేనే స్వయంగా చూసుకుంటున్నట్టు తెలుస్తోంది. మరి జయమంగళ వెంకట రమణ స్థానాన్ని బాలినేనికి ఇస్తే ఆయనకు ఏ పదవి ఇస్తారనేది తెలియట్లేదు. ఏదైతేనేం త్వరలోనే బాలినేని శ్రీనివాస రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికవుతారని మాత్రం ఆయన సన్నిహితులు జిల్లాలో చెప్పుకుంటున్నారు.