BRS : హైకోర్టులో బీఆర్ఎస్‌కు షాక్..! ఉపఎన్నికల ఆశలు ఆవిరి..!?
తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీతో సై అంటే సై అన్నట్టు ప్రవర్తిస్తోంది బీఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీపై ఆదిలోనే వ్యతిరేకత వచ్చేసిందని.. త్వరలో ఉపఎన్నికలు రాబోతున్నాయని ప్రచారం చేసింది. ఇందుకు కారణం లేకపోలేదు. బీఆర్ఎస్ ను వీడి.. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని.. ఉపఎన్నికలు తప్పవనేది ఆ పార్టీ అంచనా. హైకోర్టులో సింగిల్ బెంచ్ కూడా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా తీర్పు చెప్పింది. దీంతో ఆ పార్టీలో మరింత జోష్ వచ్చింది. అయితే ఇప్పుడు హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు బీఆర్ఎస్ కు పెద్ద ఎదురుదెబ్బగా మారింది.
గతేడాది డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో బీఆర్ఎస్ నుంచి గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి.. లాంటి వాళ్లు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దానం నాగేందర్ అయితే ఏకంగా కాంగ్రెస్ తరపున లోక్ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానం నుంచి పోటీ కూడా చేశారు. దీంతో వీళ్లపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. దానం నాగేందర్ వ్యవహారంపై బీజేపీ కూడా స్పీకర్ కు ఫిర్యాదు చేసింది.
స్పీకర్ కు ఫిర్యాదు చేసి ఎంతకాలమైనా స్పందన లేకుండా పోయింది. దీంతో ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవలని స్పీకర్ కు ఆదేశాలివ్వాలని కోరుతూ బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కె.పి.వివేకానంద గౌడ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు సింగిల్ బెంచ్.. అనర్హతపై నాలుగు వారాల్లోగా షెడ్యూల్ ఖరారు చేయాలని స్పీకర్ ను ఆదేశించింది. అయితే దీనిపై స్పీకర్ సెక్రటరీ డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన డివిజన్ బెంచ్.. స్పీకర్ కు గడువు నిర్దేశించజాలమని తీర్పు చెప్పింది. బీఆర్ఎస్ పిటిషన్లను కొట్టేసింది.
హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు బీఆర్ఎస్ కు పెద్ద ఎదురు దెబ్బగా చెప్పవచ్చు. స్పీకర్ పట్టించుకోకపోవడంతో హైకోర్టులో న్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ భావించింది. తప్పకుండా హైకోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశలు పెట్టుకుంది. అందుకే బహిరంగసభల్లో కూడా పలుమార్లు త్వరలో ఉపఎన్నికలు రాబోతున్నాయని చెప్తూ వచ్చింది. అయితే ఇప్పుడు హైకోర్టు ఈ పిటిషన్ ను కొట్టేయడంతో బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం కనిపిస్తోంది. స్పీకర్ విషయంలో గతంలో కూడా ఎంతోమంది ఇలా న్యాయస్థానాలను ఆశ్రయించారు. అయితే స్పీకర్ నిర్ణయాధికారంలో జోక్యం చేసుకోలేమనే కోర్టులు చెప్తూ వచ్చాయి. మరి ఈ వ్యవహారంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి.