T Congress: స్పీడ్ పెంచబోతున్న కాంగ్రెస్.. బీఆర్ఎస్సే టార్గెట్..!?
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తోంది. అందుకో ఆ పార్టీ ప్రజా పాలన విజయోత్సవాలను కూడా ఘనంగా నిర్వహిస్తోంది. ఈ ఏడాది కాలంలో తాము చేసిన పనులను ప్రజల వద్దకు తీసుకెళ్తోంది. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తాము ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేసినట్లు చెప్పుకుంటోంది. అయితే ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఫెయిల్యూర్ గా ముద్రవేస్తోంది. రేవంత్ పై నిత్యం విమర్శల వర్షం కురిపిస్తోంది. దీంతో బీఆర్ఎస్ పై దూకుడు పెంచాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. అందుకే త్వరలోనే ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీయబోతున్నట్టు తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం గూటికి వచ్చేశారు. వీళ్లపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. స్పీకర్ స్పందించకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠ ఏర్పడింది. అయితే సింగిల్ బెంచ్ స్పీకర్ కు గడువు నిర్దేశిస్తూ ఆదేశాలిచ్చింది. స్పీకర్ కు గడువు నిర్దేశించే అధికారంలో కోర్టుకు లేదంటూ డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది స్పీకర్ కార్యాలయం. దీన్ని సమర్థించిన డివిజన్ బెంచ్.. స్పీకర్ నిర్ణయానికి గడువు నిర్దేశించే అధికారం కోర్టుల పరిధిలో ఉండదని తేల్చేసింది. ఇది కాంగ్రెస్ పార్టీకి ప్లస్.. బీఆర్ఎస్ కు పెద్ద మైనస్.
వాస్తవానికి హైకోర్టులో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ వ్యవహారం ఉండడంతో చేరికలకు కాంగ్రెస్ పార్టీ బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు హైకోర్టులో తమకు పెద్ద ఊరట లభించింది. దీంతో చేరికలను మళ్లీ ప్రోత్సహించాలనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు సమాచారం. తాజాగా పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఇదే చెప్పారు. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్దఎత్తున చేరికలు ఉండబోతున్నట్టు తెలిపారు. గతంలో బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారనే వార్తలు వినిపించాయి. ఇప్పుడు నిజంగానే ఆ పని చేసే అవకాశం ఉందనే టాక్ కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనీసం ఏడాది కూడా పూర్తి చేసుకోకముందే బీఆర్ఎస్ ప్రభుత్వం విమర్శలు గుప్పించడం మొదలు పెట్టింది. ఇంకా చెప్పాలంటే ఆరు నెలల నుంచే రేవంత్ ను టార్గెట్ చేస్తూ వచ్చింది. హైడ్రా, మూసి లాంటీ ప్రాజెక్టులపై నిత్యం ప్రెస్ మీట్లు, ధర్నాలతో హోరెత్తించింది. దీన్ని సీఎం రేవంత్ రెడ్డి పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు హైకోర్టులో బీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ తగలడంతో ఇకపై స్పీడ్ పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం. వచ్చే నెలలో రేవంత్ రెడ్డి అధికారం చేపట్టి ఏడాది అవుతుంది. ఈ సందర్భంగా పెద్దఎత్తున చేరికలు ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.