EVM : ఈవీఎంలపై అనుమానాలు... ఎన్నికల సంఘానికి బాధ్యత లేదా..?
మన దేశంలో ఎప్పుడూ ఏదో ఒక రాష్ట్రంలో ఏదో ఒక ఎన్నిక జరుగుతూనే ఉంటుంది. అందుకే దేశవ్యాప్తంగా అన్ని ఎన్నికలను ఒకేసారి నిర్వహించింది మిగిలిన కాలమంతా అభివృద్ధి, పాలనపై దృష్టి పెట్టేందుకు జమిలి ఎన్నికల ప్రతిపాదన తెరపైకి తెచ్చింది బీజేపీ. ఈ విషయాన్ని పక్కన పెడితే ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఎలక్ట్రానికి ఓటింగ్ మెషీన్లపై (ఈవీఎం) అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. అంతేకాక పోలింగ్ నమోదు, లెక్కింపులపైన కూడా పార్టీలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ అనుమానాలను నివృత్తి చేసేందుకు ఎన్నికల కమిషన్ ముందుకు రావట్లేదు. ఇది మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.
తాజాగా మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఝార్కండ్ లో ఇండీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికతో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేవు. అయితే మహారాష్ట్ర ఎన్నికలపై మాత్రం అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. పోలింగ్ ముగిసిన రోజు సాయంత్రం 5 గంటల వరకూ 58.22 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఈసీ ప్రకటించింది. అదే రోజు రాత్రి పోలింగ్ శాతం 65.02 అని వెల్లడించింది. అంటే చివరి గంటలో దాదాపు 70 లక్షల ఓట్లు పోలైనట్లు తెలుస్తోంది. అయితే కౌంటింగ్ రోజు 66.05 శాతంగా తేలింది. దీన్నిబట్టి పోలింగ్ ప్రక్రియ ఎంత అస్తవ్యస్తంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. దీన్నే ప్రశ్నిస్తున్నాయి విపక్షాలు.
ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అవకతవకలపై ఉద్యమించాలని భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు.. మాజీ చీఫ్ ఎన్నికల కమిషనర్ ఖురేషీ కూడా మహారాష్ట్ర ఎన్నికల ప్రక్రియపై అనుమానాలు లేవనెత్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ కూడా పోలింగ్ లో వ్యత్యాసాలను లేవనెత్తారు. వీటికి ఎవరు సమాధానం చెప్తారని ప్రశ్నించారు. ఏపీకి చెందిన వైసీపీ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తోంది. ఈవీఎంలపై నమ్మకం లేదని.. బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత ఇండీ కూటమి పార్టీలన్నీ బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఈవీఎంలపై వస్తున్న ఆరోపణలను ఎన్నికల కమిషన్ లైట్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. వీటిని ఏమాత్రం పట్టించుకోవట్లేదు. వాళ్ల ఆరోపణలకు సమాధానాలు ఇవ్వట్లేదు. ఇది మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. వాస్తవానికి ఈవీఎంలను హ్యాక్ చేయలేరని గతంలోనే ఈసీ పలుమార్లు నిరూపించింది. ఎంతోమంది ఈవీఎంలను హ్యాక్ చేసేందుకు ప్రయత్నించి విఫలమ్యయారు. కానీ ఇప్పుడు సమస్య అది కాదు.. పోలింగ్ రోజు నమోదైన ఓట్లకు, కౌంటింగ్ రోజు తేలిన ఓట్లకు మధ్య భారీ తేడాలున్నాయి. వీటిపై కచ్చితంగా ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కానీ ఈసీ కేర్ చేయట్లేదు. పైగా ఓడిపోయిన పార్టీలు ఇలా ఆరోపించడం సహజమేనని చెప్తోంది. మరి ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సింది ఎవరు..?