ASBL Koncept Ambience
facebook whatsapp X

Congress Alliances : కాంగ్రెస్‌కు చుక్కలు చూపిస్తున్న ఇండీ కూటమి పార్టీలు..!

Congress Alliances : కాంగ్రెస్‌కు చుక్కలు చూపిస్తున్న ఇండీ కూటమి పార్టీలు..!

దేశంలో బీజేపీ (BJP) అధికారంలోకి వచ్చి పదేళ్లు దాటిపోయింది. వరుసగా మూడు సార్లు ఢిల్లీ పగ్గాలు చేపట్టింది కమలం పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే (NDA) కూటమి. 2014లో అధికారానికి దూరమైన కాంగ్రెస్ (Congress) పార్టీ.. దాన్ని ఎలాగైనా దక్కించుకోవాలనే పట్టుదలతో పోరాడుతోంది. 2019, 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించాలనే ఆలోచనతో చిన్నా చితకా పార్టీలన్నింటితో జతకట్టింది. ఇండియా (I.N.D.I.A.) పేరుతో కూటమి కట్టి ఎన్నికలకు వెళ్లింది. అయితే ఆ పార్టీల ఆశలు నెరవేరలేదు. మూడోసారి మోదీ (Modi) అధికార పగ్గాలు చేపట్టారు. కాంగ్రెస్ ఎంత ప్రయత్నిస్తున్నా కూటమిలోని పార్టీలు హస్తం పార్టీకి పెద్దగా సహకరించట్లేదు.

ఇండియా కూటమిలో కాంగ్రెస్ పెద్ద పార్టీ. వాస్తవానికి కాంగ్రెస్ నేతృత్వంలో మిగిలిన పార్టీలన్నీ పనిచేయాలి. ఈ కూటమిలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), తృణమూల్ కాంగ్రెస్ (TMC), ఎన్సీపీ (NCP-SP), సమాజ్ వాదీ పార్టీ (SP).. లాంటి ప్రధాన పార్టీలతో పాటు పదుల సంఖ్యలో మరికొన్ని కూడా ఉన్నాయి. ఉమ్మడిగా బీజేపీని ఎదుర్కోవాలనేది ఈ పార్టీల మూల సిద్ధాంతం. అయితే అడుగడుగునా ఈ పార్టీల మధ్య గ్యాప్ ఉన్నట్టు అర్థమవుతోంది. ఒక విధంగా చెప్పాలంటే అంశాలవారీగా పార్టీలు కొన్ని మద్దతు పలుకుతున్నాయి. మరికొన్ని వ్యతిరేకిస్తున్నాయి.

ఇప్పుడు పార్లమెంటు (Parliament) సమావేశాలు జరుగుతున్నాయి. అదానీ అంశం దేశవ్యాప్తంగానే కాక అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. అలాగే ఉత్తరప్రదేశ్ (UP) లోని సంభల్ (Sambhal) లో అల్లర్లు పెద్దఎత్తున జరుగుతున్నాయి. వీటిపై చర్చించాలని కాంగ్రెస్ పట్టుబడుతోంది. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ తో కలిసి నడిచేందుకు తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ సిద్ధంగా లేవు. సభలో ఈ అంశంపై చర్చకు పట్టుబడుతున్న సమయంలో టీఎంసీ, ఎస్పీ సభ్యులు కామ్ గా ఉండిపోయారు. సోమవారం జరిగిన కాంగ్రెస్ కూటమి భేటీకి కూడా తృణమూల్ కాంగ్రెస్ హాజరు కాలేదు. దీన్ని బట్టి ఈ కూటమిలో గ్యాప్ ఉందని అర్థమైంది.

ఇదొక్కటే కాదు.. రాష్ట్రాల్లో కూడా ఇండీ కూటమిలోని పార్టీల మధ్య అనేక సమస్యలు ఉన్నాయి. ఢిల్లీలో (Delhi) వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక్కడ కాంగ్రెస్, ఆప్ మధ్య గ్యాప్ ఉంది. అందుకే కాంగ్రెస్ తో కలిసి తాము పోటీ చేయబోవట్లేదని.. తాము ఒంటరిగానే బరిలోకి దిగబోతున్నామని కేజ్రివాల్ స్పష్టం చేశారు. వాస్తవానికి కూటమిలో ఉన్నప్పుడు పరస్పర సహకారంతో ఎన్నికలకు వెళ్లినప్పుడే ప్రత్యర్థిని ఓడించేందుకు వీలవుతుంది. కానీ ఇండీ కూటమిలోని పార్టీలు అలా వ్యవహరించట్లేదు. మహారాష్ట్రలో (Maharashtra) ఇండీ కూటమి ఓటమికి కూడా కాంగ్రెస్, శరద్ పవార్ పార్టీ, ఉద్ధవ్ ఠాక్రే పార్టీల మధ్య విభేదాలే కారణమని తెలుస్తోంది. నేతల మధ్య సమన్వయం లోపించడం వల్లే ఓడిపోయామని కాంగ్రెస్ హైకమాండ్ కూడా గ్రహించింది. పెద్ద పార్టీ అయినా త్యాగాలకు కాంగ్రెస్ సిద్ధపడింది. ఎక్కువ సీట్లను చిన్న పార్టీలకు ఇచ్చి సర్దుకుపోతోంది. అయినా ఆయా పార్టీలు కాంగ్రెస్ కు సహకరించట్లేదు. దీంతో కూటమి కట్టినా ఉపయోగం లేకుండా పోతోంది.

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :