ASBL Koncept Ambience
facebook whatsapp X

YS Jagan: కాంగ్రెస్ పార్టీతో జగన్ కలిసే ఛాన్స్ ఉందా..?

YS Jagan: కాంగ్రెస్ పార్టీతో జగన్ కలిసే ఛాన్స్ ఉందా..?

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCFP) ఓడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి (YS Jagan) ఎలాంటి స్టాండ్ తీసుకుంటారనే ఆసక్తి ఏర్పడింది. ఇన్నాళ్లూ తనకు బీజేపీ (BJP) అండగా ఉంటూ వచ్చింది. కానీ ఇప్పుడు టీడీపీ (TDP), జనసేనతో (Janasena) కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి సహకరించే పరిస్థితి లేదు. దీంతో జగన్ ఒంటరిపోరాటమైనా చేయాలి.. లేదంటే కాంగ్రెస్ కూటమిలోనైనా (Congress Alliance) చేరాలి. అయితే ఈ రెండింటిలో దేనివైపు మొగ్గు చూపుతారనే దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. షర్మిలతో (YS Sharmila) విభేదాలను జగన్ దాదాపు సెటిల్ చేసుకున్నారనే వార్తల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ కూటమిలో చేరే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీలోనే జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం మొదలైంది. తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి (YS Rajasekhar Reddy) కాంగ్రెస్ పార్టీలో కీలక నేత. ఆ పార్టీ తరపున ఆయన పీసీసీ చీఫ్ (PCC Chief) గా, ముఖ్యమంత్రిగా (Chief Minister) కూడా పనిచేశారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ తరపున జగన్ ఎంపీగా ఎన్నికయ్యారు. తండ్రి మరణానంతరం ముఖ్యమంత్రి పదవిని జగన్ ఆశించారు. అయితే కాంగ్రెస్ హైకమాండ్ దానికి ససేమిరా అనడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికొచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) ఏర్పాటు చేశారు. అదే సమయంలో తండ్రిని అడ్డం పెట్టుకుని జగన్ అక్రమంగా ఆస్తులు కూడబెట్టుకున్నారంటూ ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఇప్పటికీ ఆ కేసులు కొనసాగుతున్నాయి.

కాంగ్రెస్ పార్టీ తనపై కేసులు పెట్టడంతో ఆ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో ఉనికే లేకుండా చేశారు జగన్. కాంగ్రెస్ పార్టీ ఓటుబ్యాంకునంతటినీ తనవైపు తిప్పుకున్నారు. రాష్ట్ర విభజన, జగన్ వల్ల కాంగ్రెస్ పార్టీ ఏపీలో నామరూపాల్లేకుండా పోయింది. ఇప్పటికీ జగన్ పై కాంగ్రెస్ పార్టీ వైఖరి వ్యతిరేకంగానే ఉంది. అందుకే జగన్ ను వ్యతిరేకిస్తున్న సోదరి షర్మిలను పార్టీలో చేర్చుకుని పీసీసీ పగ్గాలిచ్చింది. షర్మిల ఇప్పుడు ఏపీలో తనపైనే బాణాలు వదులుతుండడంతో జగన్ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. దీంతో షర్మిలతో విభేదాలను పరిష్కరించుకునేందుకు జగన్ మొగ్గు చూపినట్లు సమాచారం.

మరోవైపు ఇన్నాళ్లూ తనవైపు ఉన్న బీజేపీ ఇప్పుడు టీడీపీతో కలవడంతో తనకు ఇబ్బందులు తప్పవనే నిర్ణయానికి వచ్చారు జగన్. బీజేపీతో అంటకాగడం ద్వారా ఇక తనకు ఏమాత్రం ప్రయోజనం లేదనే క్లారిటీకి వచ్చారు. అందుకే ఆ మధ్య ఢిల్లీలో వైసీపీ చేసిన ధర్నాకు ఇండియా కూటమి పార్టీలను ఆహ్వానించారు. డీఎంకే, టీఎంసీ లాంటి పార్టీల నేతలు కూడా హాజర్యాయుర. ఇటీవలికాలంలో బీజేపీకి కూడా జగన్ చురకలు అంటిస్తున్నారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని, ఎన్నికల కమిషన్ పట్టించుకోవట్లేదని దుయ్యబట్టారు. ఈ విషయాలన్నింటినీ బీజేపీ నేతలు ఇప్పటికే హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. పైగా అధికారంలో ఉంటూ ప్రతిపక్ష పార్టీ నేతకు అండగా నిలవడం తప్పుడు సంకేతాలిస్తుందనే ఆలోచనలో బీజేపీ హైకమాండ్ ఉన్నట్టు తెలుస్తోంది.

అయితే ఇప్పటికప్పుడు జగన్ బీజేపీని వదిలించుకుని కాంగ్రెస్ వైపు వెళ్తారా అంటే కష్టమేనని చెప్పొచ్చు. జగన్ బీజేపీని టార్గెట్ చేసే కొద్దీ ఆ పార్టీ మరింత ఉచ్చు బిగించడం ఖాయం. కాబట్టి బీజేపీతో అంటీముట్టు వ్యవహరిస్తూనే తటస్తంగా ఉండేందుకే జగన్ మొగ్గు చూపే అవకాశాలున్నాయి. ఎన్నికల ముందు మాత్రం జగన్ ఏదో ఒకటి తేల్చుకునే అవకాశం ఉంది. ఎన్నికల నాటికి టీడీపీ, జనసేనతో బీజేపీ పొత్తు పెటాకులవుతుందని ఆశిస్తున్నారు జగన్. అదే జరిగితే తను మళ్లీ బీజేపీతో నడవచ్చు. అలా జరగకపోతే మాత్రం కాంగ్రెస్ కూటమి సపోర్టు తప్పనిసరి అవుతుంది.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :