YS Jagan : జగన్ సవాల్‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా..? డిస్‌క్వాలిఫై చేస్తుందా..!?
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం ఎంత రంజుగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రోజూ కొత్త అంశాలు వెలుగులోకి వస్తుంటాయి. వాటిపై ఆయా పార్టీల నేతలు మాటల తూటాలు పేల్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఏపీలో మూడు పార్టీలు అధికారంలో ఉన్నాయి. వైసీపీ మాత్రమే ఒంటరిగా ఉంది. ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీంతో అలక వహించిన ఆ పార్టీ అధినేత జగన్ అసెంబ్లీకి వెళ్లేది లేదని తేల్చి చెప్పేశారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తానని స్పష్టం చేశారు. తనపై వేటు వేస్తారా.. వేసుకోండి.. చూద్దాం.. ఆ అర్హత వాళ్లకు లేదు.. అని కూడా జగన్ సవాల్ విసిరారు.
వైఎస్. జగన్ అసెంబ్లీని బాయ్ కాట్ చేయడంతో ఆయనతో పాటు వైసీపీ ఎమ్మెల్యేలపై వేటు వేయాలనే డిమాండ్ ఊపందుకుంది. ప్రజలతో ఎన్నికైన ప్రజాప్రతినిధులు చట్టసభలకు రానప్పుడు వాళ్లను సభ్యులుగా పరిగణించకూడదని కొందరు మాట్లాడుతున్నారు. సభ్యుడే నేరుగా తాను సభకు రానని చెప్పినప్పుడు వాళ్లపై ఎందుకు చర్యలు తీసుకోకూడదని టీడీపీ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. అయితే తమపై అనర్హత వేటు వేసే అధికారం స్పీకర్ కు లేదంటున్నారు జగన్. అందుకే అనర్హత గురించి మాట్లాడుతున్న వాళ్లు దమ్ముంటే ముందు తనపై వేయాలని సవాల్ విసిరారు.
దీంతో.. ఓ ప్రజాప్రతినిధిపై ఏ సమయంలో అనర్హత వేటు వేయొచ్చనే అంశం తెరపైకి వచ్చింది. రాజ్యాంగం ప్రకారం మూడు సందర్బాల్లో చట్టసభ సభ్యులపై అనర్హత వేటు వేసే అవకాశం కనిపిస్తోంది. మొదటిది.. ఏదైనా క్రిమినల్ కేసులో రెండేళ్లు, అంతకుమించి శిక్ష పడినప్పుడు అతనిపై వేటు వేయొచ్చు. ఇటీవల రాహుల్ గాంధీకి కేరళ కోర్టు రెండేళ్లు శిక్ష వేసింది. దీంతో ఆయన ఎంపీగా అనర్హుడయ్యారు. ఆయన ఇంటిని కూడా కేంద్రం ఖాళీ చేయించింది. ఇక రెండోది.. పార్టీ ఫిరాయించడం. ఒక పార్టీ తరపున గెలిచి.. మరో పార్టీలోకి వెళ్లినప్పుడు అలాంటి వాళ్లపై పార్టీ కోరిక మేరకు స్పీకర్ చర్య తీసుకోవచ్చు. గతంలో కొందరిపై ఇలా వేటు పడింది. ఇక మూడోది.. ఎవరైనా సభ్యుడు వరుసగా 60 రోజులపాటు చట్టసభలకు గైర్హాజరు అయితే వాళ్లపై స్పీకర్ అనర్హత వేటు వేయొచ్చు.
వాస్తవానికి అసెంబ్లీకి తాము వచ్చేది లేదని జగన్ ఇప్పటికే చెప్పేశారు. ఇప్పటి నుంచి సభ జరిగిన 60 రోజులపాటు వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రాకపోతే వాళ్లను అనర్హులుగా స్పీకర్ ప్రకటించే అవకాశం ఉంటుంది. అయితే ఇటీవల అసెంబ్లీ జరుగుతున్న కాలాన్ని బట్టి చూస్తే ఏడాదికి 10-15 రోజులకు మించి సభ జరగట్లేదు. ఇలా 60 రోజులపాటు సభ జరగాలంటే కనీసం 4ఏళ్లు పడుతుంది. అంతవరకూ సభ్యులుగా కొనసాగే అవకాశం ఎవరికైనా ఉంటుంది.
అయితే తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ జగన్ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. ఈ అంశంలో తనకు అనుకూలంగా తీర్పు వస్తుందనే నమ్మకంతో ఉన్నారాయన. ఒకవేళ హైకోర్టు జోక్యం చేసుకుని వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇస్తే జగన్ తో పాటు ఆయన సభ్యులు అసెంబ్లీకి వెళ్లే అవకాశం ఉంది. ఒకవేళ హైకోర్టు తీర్పు వైసీపీకి అనుకూలంగా లేకపోతే అప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి కలిగిస్తోంది. సహజంగా ఇలాంటి అంశాల్లో హైకోర్టులు జోక్యం చేసుకోవు. 2019లో లోక్ సభలో కాంగ్రెస్ పార్టీకి 52 సీట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు బీజేపీ. అయినా కాంగ్రెస్ పార్టీ కోర్టును ఆశ్రయించలేదు. ఒకవేళ తమకు ప్రతిపక్ష హోదా దక్కుతుందని తెలిసి ఉంటే కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కోర్టుకు వెళ్లి ఉండేదేమో.! మరి ఇప్పుడు జగన్ పిటిషన్ పై హైకోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందో తెలీదు.