ASBL Koncept Ambience
facebook whatsapp X

జగన్ తన ప్రయారిటీలను మార్చుకోవాల్సిన అవసరం ఉందా..?

జగన్ తన ప్రయారిటీలను మార్చుకోవాల్సిన అవసరం ఉందా..?

ఆంధ్రప్రదేశ్ లో ఐదేళ్లపాటు అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఓడిపోయింది. గత ఎన్నికల్లో 151 సీట్లతో ఘన విజయం సాధించిన ఆ పార్టీకి ఈసారి ఎన్నికల్లో కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఆ పార్టీకి ఇది గడ్డుకాలం అనే చెప్పొచ్చు. అతి తక్కువ సభ్యులతో చట్టసభల్లో పోరాడడం అంత ఈజీ కాదు. ఏదైనా ప్రజాక్షేత్రంలోనే తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఆ పార్టీ ప్రజాక్షేత్రంలోకి వెళ్తోందా... అంటే లేదనే చెప్పాలి. ఆ పార్టీ అధినేత మొదలు నేతల వరకూ అందరూ ఎవరి దారిలో వాళ్లున్నారు. ముఖ్యంగా పార్టీ అధినేత జగన్ తన ప్రయారిటీలను మార్చుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.

ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన తర్వాత తమకు తగినన్ని సీట్లు లేవని.. చట్టసభల్లో తమకు వాయిస్ వినిపించే అవకాశం కూడా రాకపోవచ్చని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ అన్నారు. అందుకే ప్రజల్లోనే ఉంటామని.. అక్కడే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని హెచ్చరించారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలవుతోంది. ఈ సమయంలో జగన్ ప్రజల్లో ఎక్కువ కాలం గడిపారా.. లేకుంటే బెంగళూరులో ఎక్కువ సమయం గడిపారా అంటే సమాధానం అర్థమైపోతుంది. మూడు నెలల్లో ఆరు సార్లు జగన్ బెంగళూరు వెళ్లారు. దీన్ని బట్టి ఆయన ప్రయారిటీలు ఏంటనేది అర్థమవుతోంది.

ఇప్పుడు రాష్ట్రమంతా వరదలతో అతలాకుతలమవుతోంది. ముఖ్యంగా విజయవాడ ప్రజలు పది రోజులుగా వరదల్లోనే చిక్కుకుని ఉన్నారు. ఇలాంటి సమయంలో ప్రతిపక్ష నేతగా జగన్ ప్రజల్లోకి వెళ్లి వారికి సాయపడి ఉంటే ఆ పార్టీకి గుర్తింపు, గౌరవం దక్కేది. కేవలం రెండ్రోజులు మాత్రమే ఆయన చుట్టపుచూపుగా అలా వెళ్లి ఇలా వచ్చేశారు. అంతే.. ఆ తర్వాత బెంగళూరు వెళ్లిపోయారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే జగన్ బెంగళూరులో సేద తీరుతున్నారనే సెటైర్లు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి. గతంలో చంద్రబాబు హైదరాబాద్ లో ఉంటే జగన్ కూడా ఇలాగే విమర్శిస్తూ వచ్చారు. కానీ అప్పుడు ఏదైనా సంఘటన జరిగినప్పుడు చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించినా ప్రభుత్వం అనుమతించలేదు. దీంతో ఆయనకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. కానీ ఇప్పుడు జగన్ పై ప్రభుత్వం అలాంటి ఆంక్షలేవీ పెట్టలేదు. ఈ అవకాశాన్ని జగన్ సద్వినియోగం చేసుకుని ఉంటే బాగుండేది.

వరదల విషయాన్ని పక్కన పెడితే మిగిలిన సమయాన్ని కూడా ఆయన ప్రజల్లో గడిపేందుకు కేటాయించట్లేదు. గతంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జైల్లో పరామర్శించేందుకు బెంగళూరు నుంచి వచ్చారు. ఇప్పుడు నందిగం సురేశ్ ను జైల్లో పరామర్శించేందుకు బెంగళూరు నుంచి వస్తున్నారు. జనాల కంటే కేసుల్లో ఇరుక్కుని ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులను కలవడమే జగన్ ప్రయారిటీగా కనిపిస్తోందని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ప్రభుత్వం సరిగా పని చేయట్లేదని విమర్శిస్తే సరిపోదని.. ప్రజల్లోకి వెళ్లినప్పుడే జగన్ కు మళ్లీ పూర్వవైభవం వస్తుందని సూచిస్తున్నారు. వైసీపీ నేతలు కూడా జగన్ బయటకు వచ్చినప్పుడు మాత్రమే కనిపిస్తున్నారు. ఆ తర్వాత వాళ్ల పనుల్లో వాళ్లు ఉంటున్నారు. మొత్తంగా వైసీపీ తన ప్రయారిటీలను మార్చుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :