ASBL Koncept Ambience
facebook whatsapp X

జగన్ రాజీనామా చేయనున్నారా..? నిజమెంత..??

జగన్ రాజీనామా చేయనున్నారా..? నిజమెంత..??

 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశలో కూరుకుపోయాయి. ఇప్పుడిప్పుడే ఓటమి నుంచి నేతలు కోలుకుంటున్నారు. మరోవైపు వైసీపీ అధినేత జగన్ కూడా ఫలితాల పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గతంలో ఎన్నడూ చేయని విధంగా పాలించినా ఇలాంటి ఫలితాలు రావడం ఆశ్చర్యకరంగా ఉందని ఆయన ఆవేదన చెందుతున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేగా ఉండడం కష్టమని.. అందుకే రాజీనామా చేసి పార్లమెంటుకు వెళ్లే యోచనలో జగన్ ఉన్నారనే టాక్ సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తోంది. మరి ఇందులో నిజమెంత..?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 39శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. కానీ సీట్లు మాత్రం 11 వచ్చాయి. వాస్తవానికి ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష స్థానం దక్కాలంటే సంప్రదాయం ప్రకారం 10శాతం మేర సీట్లు దక్కించుకోవాలి. అంటే 18 సీట్లు రావాలి. వైసీపీకి 11 మాత్రమే రావడంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కే పరిస్థితి లేదు. ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా వద్దా అనేది పూర్తిగా అధికార టీడీపీ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు టీడీపీ సుముఖంగా లేదు. దీంతో జగన్ కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే ఉండిపోనున్నారు.

కనీసం ప్రతిపక్ష హోదా దక్కితే కొన్ని అదనపు ప్రయోజనాలు కలుగుతాయి. ప్రోటోకాల్ మర్యాదలు లభిస్తాయి. అలా కాకుండా ఎమ్మెల్యేగా ఉంటే అందరిలో తానూ ఒకడిలా ఉండిపోవాల్సి వస్తుంది. ఇటీవల ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం రోజే తనస్థానమేంటో జగన్ కు అర్థమైపోయింది. దీన్ని వైసీపీ శ్రేణులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడమేంటని ఆందోళన చెందుతున్నాయి. దీంతో ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేసి ఢిల్లీ వెళ్లిపోవడమే బెటర్ అనే ఆలోచనలో జగన్ ఉన్నారనే టాక్ సోషల్ మీడియాలో నడుస్తోంది. జగన్ ఎలాంటి నిర్ణయం అయినా తీసుకోవచ్చని కొందరు భావిస్తున్నారు.

అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేయాలనుకుంటే అది ఆత్మహత్యాసదృశ్యమే అవుతుంది. ఇప్పటికే పార్టీ కేడర్ మొత్తం పూర్తి నిరాశలో కూరుకుపోయి ఉంది. ఇలాంటప్పుడు పార్టీ అధినేతే పలాయనవాదం అనుసరిస్తే అది తప్పకుండా పార్టీపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కేడర్ మొత్తం చిలువలుపలువలుగా మారిపోతుంది. కాబట్టి అలాంటి పని చేయొద్దని కొంతమంది నేతలు జగన్ కు సూచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే అసలు తనకు అలాంటి ఉద్దేశం లేదని.. సోషల్ మీడియాలో కొంతమంది అలాంటి కథనాలు వండివారుస్తుంటారని.. వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని జగన్ చెప్పినట్టు సమాచారం. పైగా జగన్ లాంటి మొండిఘటం ఇలాంటి పని చేయకపోవచ్చని.. కచ్చితంగా రాష్ట్రంలోనే ఉండి పోరాడుతారని వైసీపీ పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :