Janasena : పార్టీ బలోపేతం కోసం పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్..!
ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే కూటమి కనీవినీ ఎరుగని మెజారిటీతో అధికారం చేజిక్కించుకుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికల్లో సూపర్ సక్సెస్ అయింది. ముఖ్యంగా జనసేన పార్టీ వంద శాతం స్ట్రయిక్ రేట్ తో చరిత్ర సృష్టించింది. దీంతో జనసేన పార్టీ ఫుల్ జోష్ లో కనిపిస్తోంది. ప్రభుత్వంలో కూడా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కీలక భూమిక పోషిస్తున్నారు. డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తున్నారు. సీఎం చంద్రబాబు కూడా పవన్ కల్యాణ్ తో సంప్రదించిన తర్వాతే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికైతే కూటమిలో ఆల్ ఈజ్ వెల్. మరి భవిష్యత్తులో ఇలాగే ఉంటుందా.. ఉండదా అని చెప్పే పరిస్థితి లేదు.
పార్టీ బలంగా ఉంటేనే రాజకీయాల్లో మనుగడ సాధించే అవకాశం ఉంటుంది. ఏ పార్టీకైనా ఇదే వర్తిస్తుంది. పవన్ కల్యాణ్ పార్టీ పెట్టినప్పుడు తాను పాతికేళ్ల లక్ష్యంతో అడుగు వేస్తున్నట్టు చెప్పారు. తనకు ముఖ్యమంత్రి పీఠంపై ఆశ లేదని.. రాజకీయాల్లో మార్పు తీసుకురావడమే తన లక్ష్యమని వెల్లడించారు. 2014లో టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతిచ్చారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఒక్క సీటు మాత్రమే దక్కించుకున్నారు. పోటీ చేసిన రెండు చోట్లా పవన్ కల్యాణ్ ఓడిపోయారు. అయితే 2024 నాటికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. జగన్ ను ఓడించడమే లక్ష్యంగా పవన్ పనిచేశారు. టీడీపీ, బీజేపీని ఏకతాటిపైకి తీసుకొచ్చి చక్రం తిప్పారు.
పవన్ కల్యాణ్ పూర్తిగా చంద్రబాబు చెప్పుచేతల్లో పని చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. టీడీపీకి గులాంగురీ చేసేందుకే పవన్ కల్యాణ్ పార్టీ పెట్టారని వైసీపీ నేతలు ఇప్పటికీ విమర్శిస్తున్నారు. అయితే పవన్ కల్యాణ్ మాత్రం ఇవేవీ పట్టించుకోవట్లేదు. పూర్తిగా కూటమి నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేసుకుంటూ పోతున్నారు. చంద్రబాబుకు తన సంపూర్ణ మద్దతు తెలిపారు. మరో పదేళ్లు చంద్రబాబే సీఎంగా ఉండాలని ఆకాంక్షించారు. అంతేకాదు.. ఆయన లక్ష్యాలను చేరుకునేందుకు ఏం చేయాలో ఆదేశించాలని.. వాటిని తు.చ. తప్పకుండా అమలు చేసేందుకు తనతో సహా అందరం సిద్ధంగా ఉన్నామని పవన్ వెల్లడించారు. దీన్ని బట్టి వాళ్ల మధ్య బందం ఎంత గట్టిగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అలాగని పవన్ కల్యాణ్ తన జనసేన పార్టీని పూర్తిగా వదిలేయలేదు. పార్టీ బలోపేతంకోసం ఏం చేయాలో తెరవెనుక కామ్ గా చేసుకుంటూ పోతున్నారు. వైసీపీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీలోని పలువురు కీలక నేతలు జనసేన వైపు చూస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు జనసేన కండువా కప్పేసుకున్నారు. వైసీపీలో కీలకంగా ఉన్న బాలినేని శ్రీనివాస రెడ్డి, సామినేని ఉదయభాను, కిలారు రోశయ్య.. తదితరులు జనసేనలో చేరారు. వైసీపీ నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి కుమార్తె కూడా జనసేన కండువా కప్పుకున్నారు. వీళ్లతో పాటు పలు జిల్లాల్లో చోటామోటా నేతలతో పాటు ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేషన్ మేయర్లు, డిప్యూటీ మెయర్లు.. కూడా జనసేనలో చేరుతున్నారు. త్వరలో వైసీపీకి చెందిన మరో ముగ్గురు మాజీ మంత్రులు జనసేనలో చేరబోతున్నట్టు సమాచారం. వీళ్లంతా ఆల్రెడీ రాజకీయాల్లో సీనియర్లు. కాబట్టి త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ తదితర ఎన్నికల్లో వీళ్లను చట్టసభలకు పంపడం ద్వారా అక్కడ కూడా జనసేన బలం పెంచుకోవాలనే ఆలోచనలో పవన్ ఉన్నారు.