KCR : కేసీఆర్ రాజకీయ సన్యాసం..?
తెలంగాణ జాతిపితగా కేసీఆర్ ను పిలుచుకుంటూ ఉంటారు ఆయన అభిమానులు. తెలంగాణ రాష్ట్రం సాకారమైందంటే కచ్చితంగా అది కేసీఆర్ వల్లే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణ కోసమే ప్రత్యేక పార్టీ పెట్టి పోరాడి విజయం సాధించారాయన. అందుకు కృతజ్ఞతగా తెలంగాణ ప్రజలు కూడా పదేళ్లపాటు ఆయనకు అధికారం కట్టబెట్టారు. ఇప్పుడు ఆయన ప్రతిపక్షానికి పరిమితం కావాల్సి వచ్చింది. అయితే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయినప్పటి నుంచి ఆయన అస్సలు బయటకు రావట్లేదు. ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు. దీంతో ఆయన రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్నారేమోననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కేసీఆర్ ఏం చేసినా దానికో ప్రత్యేకత ఉంటుంది. ఆయన నోరు తెరిస్తే ఒక సంచలనం.. ఆయన మౌనం దాల్చితే అది మరొక సంచలనం. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన పెద్దగా ప్రజల్లోకి వచ్చేవాళ్లు కాదు. కనీసం సెక్రటేరియేట్ కు కూడా వెళ్లేవాళ్లు కాదు. ప్రగతి భవన్ నుంచి పరిపాలన సాగించేవారు. ఇలాంటి ముఖ్యమంత్రి ఎవరూ ఉండరని విపక్షాలు అప్పట్లో విమర్శించేవి. ఇప్పుడు అధికారం లేదు. ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి ప్రజలకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతిపక్షంపై ఉంటుంది. అయితే కేసీఆర్ ఈ పని కూడా చేయట్లేదు. కనీసం స్పందన కూడా ఉండట్లేదు.
తెలంగాణలో రేవంత్ సర్కార్ కొలవుదీరి ఏడాది కావస్తోంది. ఈ మధ్యకాలంలో అనేక పరిణామాలు జరిగాయి. హైడ్రా, మూసీ పునరుజ్జీవం, కులగణన, రైతు రుణమాఫీ, 5 గ్యారంటీల అమలు.. లాంటి అనేక అంశాలు వివాదాలకు దారితీశాయి. బీఆర్ఎస్ పార్టీ వీటిపై గట్టిగానే ఫైట్ చేస్తోంది. కేటీఆర్ పార్టీ శ్రేణులను ముందుండి నడిపిస్తున్నారు. కానీ కేసీఆర్ మాత్రం అస్సలు బయటకు రావట్లేదు. వీటిపై నోరు మెదపట్లేదు. కులగణన లాంటి కీలక అంశాలపైన కూడా కేసీఆర్ మాట్లాడకపోవడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇప్పుడు కాకపోతే కేసీఆర్ ఇంకెప్పుడు బయటికొస్తారు.. ఇంకెప్పుడు మాట్లాడతారు.. అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు.
గెలుపోటములు రాజకీయ పార్టీలకు సహజమే. తెలంగాణలో ఓడిపోయింది బీఆర్ఎస్. అప్పుడు ప్రజాతీర్పును గౌరవించడం పార్టీల లక్షణం. అలాగే గెలిచిన పార్టీని అభినందించడం సంప్రదాయం. అయితే కేసీఆర్ ఈ రెండూ చేయలేదు. ప్రజాతీర్పుపైన స్పందించలేదు.. గెలిచిన కాంగ్రెస్ ను అబినందించనూ లేదు. ఈ మధ్యకాలంలో రాజస్థాన్, హర్యానా, జమ్ముకశ్మీర్ ఎన్నికలు జరిగాయి. తాజాగా మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికలు ముగిశాయి. వాస్తవానికి మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేయాలని కేసీఆర్ ఉవ్విళ్లూరారు. అక్కడ పెద్దఎత్తున ప్రచారం కూడా చేశారు. కానీ ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కనీసం వాటిపై స్పందించనూ లేదు. ఇలా రాష్ట్రంలో, దేశంలో ఏం జరిగినా కేసీఆర్ మాత్రం మౌనంగానే ఉంటున్నారు. ఫాంహౌస్ లో తనను కలిసిన వాళ్లలో పిచ్చాపాటీ తప్పా రాష్ట్రానికి సంబంధించి కానీ, దేశానికి సంబంధించిన కీలకమైన అంశాలపైన కానీ ఒక పార్టీ అధినేతగా కనీసం స్పందించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. కేసీఆర్ పూర్తిగా రాజకీయాలకు స్వస్తి చెప్పారని.. కుమారుడు కేటీఆర్ కు బాధ్యతలు అప్పగించారని పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది.