ASBL Koncept Ambience
facebook whatsapp X

కేజ్రీవాల్ రాజీనామా వెనుక మాస్టర్ ప్లాన్..!!

కేజ్రీవాల్ రాజీనామా వెనుక మాస్టర్ ప్లాన్..!!

ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆరవింద్ కేజ్రీవాల్ రాజీనామా ఖాయమైంది. ఢిల్లీలో సమావేశమైన ఆప్ శాసనసభా పక్ష సమావేశం అతీషి మర్లేనాను కొత్త ముఖ్యమంత్రిగా ఎంచుకుంది. దీంతో కేజ్రివాల్ రాజీనామా ఖాయమైంది. సాయంత్రం ఆయన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించనున్నారు. ఆ తర్వాత ఆతీషి కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారు. ఇన్నాళ్లు జైల్లో ఉన్నా కూడా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయని కేజ్రివాల్.. ఇప్పుడు బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత ఎందుకు రిజైన్ చేస్తున్నారనేది ఆసక్తి కలిగిస్తోంది. అయితే కేజ్రివాల్ రాజీనామా వెనుక మాస్టర్ స్కెచ్ ఉన్నట్టు అర్థమవుతోంది.

ఢిల్లీ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నాయి. అంటే ఇంకో ఐదు నెలలు మాత్రమే సమయం ఉంది. కాబట్టి ఈ సమయంలో రాజీనామా చేసినా పెద్దగా నష్టపోయేదేమీ లేదు. పైగా హర్యానాతో పాటు నవంబర్ లోనే ఢిల్లీకి కూడా ఎన్నికలు జరపాలని కేజ్రివాల్ డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ఎన్నికల సంఘం ఆ పని చేస్తే కేజ్రివాల్ కు మరింత మేలు జరుగుతుంది. అయితే ఎన్నికల సంఘం ఆ పని చేయకపోవచ్చు. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాదే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

తను రాజీనామా చేసి మరొకరిని ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టడం ద్వారా తన పార్టీలో ప్రజాస్వామ్యం ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కేజ్రివాల్. తన భార్య సునీతను కాకుండా అతీషిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడం వెనుక వ్యూహం కూడా ఇదే. తనకు ముఖ్యమంత్రి పీఠంపై మోజు లేదని.. త్యాగాలకు తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కేజ్రివాల్.

ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవడం వెనుక మరో వ్యూహం సానుభూతి పొందడం. తనను బీజేపీ అనవసరంగా వేధిస్తోందని.. ఆప్ ను చీల్చేందుకు కుట్ర చేస్తోందని కేజ్రివాల్ చాలాకాలంగా ఆరోపిస్తున్నారు. ఆ పార్టీపై ఎందాకైనా పోరాడతానని.. ఇందుకోసం పదవీ త్యాగానికి కూడా సిద్ధమని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కేజ్రివాల్. తద్వారా ఎన్నికల్లో సానుభూతి పొంది లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నారు.

రాజీనామా ద్వారా లిక్కర్ స్కాం వ్యవహారాన్ని పక్కదోవ పట్టించడం మరో వ్యూహం. ఇప్పుడు లిక్కర్ స్ వ్యవహారం సైడ్ అయిపోయి రాజీనామా అంశంపైనే చర్చ జరుగుతుంది. ఎన్నికల వరకూ ఇదే అంశాన్ని సజీవంగా ఉంచడం ద్వారా లబ్ది పొందొచ్చు. ముఖ్యమంత్రి పీఠం నుంచి వైదొలగడంతో ఎన్నికల వరకూ పూర్తిగా ప్రజల్లోనే ఉండే అవకాశం దొరుకుతుంది. న్యాయ స్థానంలో ఇప్పటికే తనకు న్యాయం జరిగిందని.. ఇప్పుడు ప్రజాక్షేత్రంలో కూడా తేల్చుకుంటానని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కేజ్రివాల్. బీజేపీ ప్రభుత్వం తనను అక్రమంగా ఈ కేసులో ఇరికించి ఇబ్బందులు పెడుతోందని.. దీనిపై తీర్పు ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చే అవకాశం ఉంది. ఒక్క దెబ్బకు ఎన్నో పిట్టలు అన్నట్టు తన రాజీనామా ద్వారా కేజ్రివాల్ భారీ వ్యూహమే పన్నారని అర్థమవుతోంది.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :