KTR Arrest: కేటీఆర్ అరెస్ట్ కావడం ఖాయమా..?
తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ఎత్తులు పైఎత్తులు వేసుకుంటూ రాజకీయాన్ని రంజుగా మార్చేస్తున్నారు. కాంగ్రెస్ తప్పిదాలను ఎత్తిచూపడంలో బీఆర్ఎస్ దూకుడుగా ముందుకెళ్తోంది. దీంతో బీఆర్ఎస్ కు ముకుతాడు వేసేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ తమ ముందున్న అన్ని మార్గాలనూ వెతుకుతోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసినా దాన్ని తప్పుబడుతూ రంధ్రాన్వేషణ చేస్తోంది బీఆర్ఎస్. గులాబీ పార్టీకి చెక్ చెప్పాలంటే బలమైన అస్త్రాలను బయటకు తీయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే కొన్ని ఆయుధాలను బయటకు తెచ్చేందుకు సిద్ధమైంది.
ఇటీవల సియోల్ పర్యటనలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే రాజకీయ బాంబులు పేలతాయన్నారు. పొంగులేటి కామెంట్స్ పై తెలంగాణలో తీవ్ర ఆసక్తి నెలకొంది. కేటీఆర్ లాంటి కీలక నేతలు అరెస్టు కాబోతున్నారని.. అందుకే పొంగులేటి అలా కామెంట్స్ చేశారని అందురూ చెప్పుకుంటున్నారు. అయితే పొంగులేటి కామెంట్స్ వెనుక అర్థమేంటో ఇప్పుడిప్పుడే బయటకు తెలుస్తోంది. నాడు అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా కేటీఆర్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకోబోతున్నట్టు అర్థమవుతోంది. ఈ వ్యవహారంలో ఆయన అరెస్టు కావడం ఖాయమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహించింది. దీనికిగానూ నిర్వహణ సంస్థ ఫార్ములా ఈ-ఆపరేషన్స్ కు నాటి పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి అర్వింద్ కుమార్ రూ.55 కోట్లు చెల్లించారు. అయితే దీనికి ఆర్థిక శాఖ అనుమతి తీసుకోలేదు. దీనిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. విచారణలో అర్వింద్ కుమార్ అనేక కీలక విషయాలు వెల్లడించారు. నాటి మంత్రి కేటీఆర్ మౌఖిక ఆదేశాల మేరకే తాను ఆ డబ్బు చెల్లించినట్లు వాంగ్మూలం ఇచ్చారు. దీనిపై మరింత లోతైన విచారణ కోసం తాజాగా అర్వింద్ కుమార్ కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది.
ఏసీబీ విచారణలో అర్వింద్ కుమార్ వెల్లడించే అంశాలను బట్టి కేటీఆర్ పై చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. కేటీఆర్ చెప్పడం వల్లే తాను డబ్బులు చెల్లించానని.. ఇక్కడ తాను ఎక్కడా నిబంధలను ఉల్లంఘించలేదని అర్వింద్ కుమార్ చెప్తున్నారు. ఇప్పుడు కూడా అదే మాటకు కట్టుబడి ఉన్నట్టయితే కేటీఆర్ ను కూడా విచారణకు పిలిచే అవకాశం ఉంటుంది. విచారణకు వచ్చినప్పుడు కేటీఆర్ ను అరెస్టు చేయవచ్చని కూడా కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా HMDA సొమ్మును విదేశీ సంస్థకు చెల్లించడంపై ఈడీ కూడా రంగంలోకి దిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. అదే జరిగితే కేటీఆర్ మెడకు ఉచ్చు బిగుసుకున్నట్టే.!