KTR : కేటీఆర్ అరెస్ట్ ఖాయమా..?
తెలంగాణలో రాజకీయం రంజుగా సాగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టడంలో బీఆర్ఎస్ ముందుంటోంది. అయితే బీఆర్ఎస్ కుట్రలను బయటపెట్టి ఆ పార్టీని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. ఆ రెండు పార్టీల మధ్య ఇప్పుడు లగచర్ల వ్యవహారం మరోసారి అగ్గి రాజేసింది. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఏ క్షణమైనా అరెస్టు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తనను అరెస్టు చేయడం ఖాయమని కేటీఆర్ కూడా గుర్తించినట్లు తెలుస్తోంది. అందుకే తెలంగాణ భవన్ కు పెద్దఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు తరలి వస్తున్నాయి.
కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా కంపెనీ ఏర్పాటుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ప్రజాభిప్రాయ సేకరణకోసం అక్కడికి వెళ్లిన కలెక్టర్ సహా ఇతర ఉన్నతాధికారులపై స్థానికులు తిరగబడ్డారు. కొందరిపై దాడి చేశారు. వాహనాలు ధ్వంసం చేశారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దాడికి పాల్పడిన వాళ్లపై కేసులు పెట్టి అరెస్టు చేసింది. వీళ్లను విచారిస్తున్న సందర్భంగా దాడి వెనుక కుట్ర దాగి ఉన్నట్టు గుర్తించింది. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, కేటీఆర్ తదితరులు ఈ దాడి వెనుక సూత్రధారులని విచారణలో తేలింది. దీంతో పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు.
పట్నం నరేందర్ రెడ్డి స్టేట్ మెంట్ లో కేటీఆర్ పేరు వెల్లడించినట్లు ఎఫ్ఐఆర్ నమోదైంది. దాడికి ముందు వీళ్లు మాట్లాడుకున్నారని తేలింది. స్థానికులను రెచ్చగొట్టి అధికారులపై దాడికి పురిగొల్పారని పోలీసులు చెప్తున్నారు. దీంతో కేటీఆర్ ను కూడా ఈ కేసులో అరెస్టు చేస్తారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అర్ధరాత్రి నుంచే ఈ వార్తలు రావడంతో ఆయన ఇంటి దగ్గర బీఆర్ఎస్ శ్రేణులు మోహరించాయి. ఇప్పుడు బీఆర్ఎస్ భవన్ దగ్గర కూడా నేతలు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. తనను ఏదో ఒక కేసులో రేవంత్ రెడ్డి అరెస్టు చేస్తారని తనకు ఎప్పుడో తెలుసని కేటీఆర్ కూడా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో కేటీఆర్ అరెస్ట్ ఖాయమని తెలుస్తోంది.
ఫార్ములా ఈ-రేసు వ్యవహారంలో ఇప్పటికే కేటీఆర్ ను విచారించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అయితే ఇందులో అరెస్టు చేసేందుకు గవర్నర్ అనుమతి కోరారు. ఇంతవరకూ గవర్నర్ అనుమతి ఇవ్వలేదు. దీంతో ఈ కేసు మూలన పడింది. ఇంతలో లగచర్ల ఘటన జరగడం.. ఇందులో బీఆర్ఎస్ నేతల ప్రమోయం ఉన్నట్టు గుర్తించడంతో ఆ పార్టీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పైగా దాడికి పాల్పడిన వాళ్లెవరి భూమీ ప్రభుత్వ భూసేకరణలో లేదని విచారణలో తేలింది. కేవలం కుట్రపూరితంగానే అధికారులపై వీళ్లు దాడి చేశారని పోలీసులు చెప్తున్నారు. పట్నం నరేందర్ రెడ్డి ఇచ్చిన స్టేట్ మెంట్ మేరకు కేటీఆర్ కూడా అరెస్టు కాక తప్పదని అటు పోలీసులు, ఇటు కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు.