Council : కూటమికి చెక్ పెడుతున్న మండలి ఛైర్మన్..!?
ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే కూటమి అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన, బీజేపీ ఇక్కడ ఉమ్మడిగా పరిపాలిస్తున్నాయి. అసెంబ్లీలో తిరుగులేని మెజారిటీతో కూటమి అధికార పగ్గాలు చేపట్టింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. అయితే శాసన మండలిలో మాత్రం ఇప్పటికీ వైఎస్సార్సీపీదే ఆధిపత్యం. ఇక్కడ కూడా ఆ పార్టీని నిలువరించాలని కూటమి ఎత్తుగడలు వేస్తోంది. కానీ అవి వర్కవుట్ కావట్లేదు. శాసన మండలి ఛైర్మన్ మోషేన్ రాజు ఇక్కడ కూటమి ఎత్తులును చిత్తు చేస్తున్నారు. దీంతో ఇప్పటికీ శాసన మండలిలో వైసీపీ పెత్తనం చేయగలుగుతోంది.
అసెంబ్లీలో తిరుగులేని మెజారిటీ రావడంతో కూటమి పార్టీలు శాసన మండలిపై దృష్టి సారించాయి. ఇక్కడ ఎమ్మెల్సీలతో రాజీనామాలు చేయించి ఉపఎన్నికలు నిర్వహించడం ద్వారా ఆ స్థానాలను తమ ఖాతాలో వేసుకోవాలని స్కెచ్ వేశాయి. అందులో భాగంగా నలుగురు ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామాలు చేశారు. కర్రి పద్మశ్రీ, కల్యాణ చక్రవర్తి, పోతుల సునీత, జయమంగళ వెంకటరమణ తమ పదవులకు, వైసీపీ సభ్యత్వానికి కూడా రాజీనామాలు చేసేశారు. వీళ్లలో కొంతమంది రాజీనామా చేసి మూడు నెలలవుతోంది. అయితే ఇంతవరకూ అవి రాజీనామా పొందలేదు. ఇటీవల సమావేశాల సందర్భంగా కొందరు సభ్యులు మండలి ఛైర్మన్ ఎదుట ప్లకార్డులు పట్టుకుని మరీ తమ రాజీనామాలు ఆమోదించాలని డిమాండ్ చేశారు.
శాసన మండలిలో మొత్తం సీట్లు 58. మిగిలిన వాటిలో వైసీపీకి 32 మంది, టీడీపీకి 9, జనసేనకు ఒకరు, పీడీఎఫ్ కు ఇద్దరు, నలుగురు ఇండిపెండెంట్లు, నామినేటెడ్ సభ్యులు 8 మంది ఉన్నారు. అధికారికంగా 2 స్థానాలు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. రాజీనామాలు చేసిన నలుగురివీ ఇంతవరకూ ఛైర్మన్ ఆమోదించలేదు. వాటిని ఆమోదిస్తే మరికొంతమందితో రాజీనామాలు చేయించేందుకు కూటమి సిద్ధంగా ఉంది. జఖియాఖానమ్, పండుల రవీంద్రబాబు, తోట త్రిమూర్తులు తదితరులు కూడా వైసీపీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అయితే మండలి ఛైర్మన్ దగ్గర వీళ్ల పప్పులు ఉడకట్లేదు.
గత ఐదేళ్లూ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు శాసన మండలిలో టీడీపీ పెత్తనం చెలాయించగలిగింది. మూడు రాజధానుల బిల్లును శాసన మండలి తిరస్కరించింది. దీంతో మొత్తంగా శాసన మండలినే రద్దు చేయాలని జగన్ అప్పట్లో భావించారు. అయితే ఎందుకో వెనక్కు తగ్గారు. కానీ ఇప్పుడు అదే మండలి వల్ల కూటమి ఎత్తుగడలకు జగన్ బ్రేక్ వేయగలుగుతున్నారు. రాజీనామాల ఆమోదంపై మండలి ఛైర్మన్ దే తుది నిర్ణయం. ఆయన నిర్ణయం తీసుకునేంత వరకూ ఎవరూ ఏమీ చేయలేరు. దీంతో రాజీనామా చేసిన సభ్యులు కానీ, కూటమి పార్టీలు కానీ ఏమీ చేయలేక తలలు పట్టుకుంటున్నాయి.