ASBL Koncept Ambience
facebook whatsapp X

తెలంగాణలోనూ బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఏర్పాటు..!!

తెలంగాణలోనూ బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఏర్పాటు..!!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సూపర్ సక్సెస్ అయింది. తెలుగుదేశం పార్టీతో జతకట్టిన జనసేన, బీజేపీ ఘన విజయం సాధించాయి. గతంలో ఎన్నడూ లేని ఫలితాలు వచ్చాయి. ఏపీలో కూటమి సక్సెస్ దేశవ్యాప్తంగా చర్చనీయాంసమైంది. కలసికట్టుగా పనిచేస్తే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని ఏపీలో కూటమి నిరూపించింది. ఇప్పుడు మిగిలిన చోట్ల కూడా ఇలాగే కలిసి పనిచేసే ఆలోచనలో ఉన్నాయి ఆ పార్టీలు. తెలంగాణలో కూడా బీజేపీతో కలిసి పని చేసేందుకు టీడీపీ, జనసేన ఆసక్తి చూపిస్తున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన రాబోతున్నట్టు సమాచారం.

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీతో జనసేన, బీజేపీ జట్టుకట్టి అధికారంలోకి వచ్చాయి. అక్కడ ఆ రెండు పార్టీలూ తెలుగుదేశం నేతృత్వంలో పనిచేస్తున్నాయి. తెలంగాణలో కూడా టీడీపీ, జనసేనకు కాస్తో కూస్తో పట్టుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని అభిమానించే వాళ్లు ఎంతో మంది తెలంగాణలో ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆ పార్టీకి మంచి ఓటు బ్యాంకు ఉంది. ఏపీలో అధికారంలో ఉన్నాం కాబట్టి తెలంగాణలో కూడా టీడీపీని అభిమానించే వాళ్లందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి పనిచేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. పార్టీని బలోపేతం చేయడం ద్వారా నిర్ణాయక శక్తిగా మారే అవకాశం ఉందనేది ఆయన ఆలోచన.

అలాగే జనసేనకు టీడీపీ స్థాయి ఓటు బ్యాంకు లేకపోయినా కొంచెం పట్టుంది. పవన్ కల్యాణ్ ను అభిమానించే వాళ్లున్నారు. ఏపీలో టీడీపీ, జనసేనతో కలిసి పనిచేసినట్లే.. ఇక్కడ ఆ రెండు పార్టీలతో జట్టు కడితే తెలంగాణలో మంచి ఫలితాలు రాబట్టవచ్చనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో బీజేపీ, జనసేన ఇక్కడ కలిసి పనిచేశాయి. ఆ తర్వాత ఎవరి దారి అవి చూసుకున్నాయి. అయితే ఇప్పుడు పరిస్తితులు మారాయి. కలిసి పని చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు రాబట్టుకోవచ్చు. పైగా తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్ పై బీజేపీకి ఇంకా పూర్తిస్థాయి పట్టు దొరకలేదు. ఇప్పుడు ఈ రెండు పార్టీలను కలుపుకుని వెళ్తే కచ్చితంగా సక్సెస్ అవుతామనే ధీమా బీజేపీలో కనిపిస్తోంది.

తెలంగాణలో కచ్చితంగా అధికారంలోకి వస్తామని బీజేపీ భావించింది. అయితే ఆ పార్టీ అంచనాలు తలకిందులయ్యాయి. ఇందుకు అనేక కారణాలున్నాయి. అయితే లోక్ సభ ఎన్నికల నాటికి ఆ పార్టీ బాగా పుంజుకుంది. గతంలో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా సత్తా చూపకపోయినా లోక్ సభ ఎన్నికల నాటికి బలపడుతోంది బీజేపీ. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సత్తా చాటినప్పుడే పార్టీకి మేలు జరుగుతుంది. క్షేత్రస్థాయిలో బలం చేకూరుతుంది. అందుకే టీడీపీ, జనసేనను కలుపుకుపోవడం ద్వారా ఆ స్థాయి పట్టు సాధించాలనుకుంటోంది బీజేపీ. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఆ పార్టీలు కూటమిగా బరిలోకి దిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :