ASBL Koncept Ambience
facebook whatsapp X

NDA Alliance : ఏపీలో కూటమి పార్టీల మధ్య అన్యోన్య దాంపత్యం..!

NDA Alliance : ఏపీలో కూటమి పార్టీల మధ్య అన్యోన్య దాంపత్యం..!

ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే కూటమి అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో టీడీపీ, జనసేన, బీజేపీ భాగస్వాములుగా ఉన్నాయి. ఎన్నికలకు ముందు టీడీపీ, జనసేన, బీజేపీ ఎవరికి అవే అన్నట్టు ఉండేవి. బీజేపీతో జనసేన కలిసి ఉన్నా అంటీముట్టనట్టే వ్యవహరించేది. అయితే చంద్రబాబు అరెస్టు తర్వాత తాను టీడీపీతో కలిసి పోటీ చేయబోతున్నట్టు జనసేనాని పవన్ కల్యాణ్ ప్రకటించడం.. ఆ కూటమిలోకి బీజేపీ కూడా వస్తే బాగుంటుందని చెప్పడం.. చకచకా జరిగిపోయాయి. ఎన్నికల ముంగిట అనుకున్నట్టే బీజేపీ కూడా టీడీపీ, జనసేనతో కలిసింది. ఉమ్మడిగా మూడు పార్టీలూ పోటీ చేశాయి. కనీవినీ ఎరుగని విజయాన్ని నమోదు చేశాయి.

ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఐదు నెలలయింది. ఈ మధ్యకాలంలో మూడు పార్టీల మధ్య పెద్దగా చెప్పుకోదగ్గ విపరిణామాలేవీ లేవని చెప్పొచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో జనసేన, బీజేపీ కలసికట్టుగానే ముందుకు సాగుతున్నాయి. చంద్రబాబు నాయుడు కూడా జనసేన, బీజేపీలకు తగిన ప్రాధాన్యత ఇస్తున్నారు. నామినేటెడ్ పోస్టుల్లో కూడా ఆ రెండు పార్టీలకు సముచిత స్థానం కల్పిస్తున్నారు. టీడీపీకి 60, జనసేనకు 30, బీజేపీకి 10 శాతం చొప్పున పోస్టులు పంచుకోవాలని ఆ మూడు పార్టీలు తీర్మానించుకున్నట్టు సమాచారం. అందుకు తగ్గట్లే భర్తీ జరుగుతున్నట్టు అర్థమవుతోంది.

ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హోంమంత్రి అనిత పనితీరుపై కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో టీడీపీ, జనసేన మధ్య గ్యాప్ వచ్చేసిందని కొంతమంది సోషల్ మీడియాలో అభిప్రాయపడ్డారు. పవన్ కల్యాణ్ కు టీడీపీ తగిన గౌరవం ఇవ్వట్లేదని.. అందుకే జనసేనాని అసంతృప్తితో ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. టీడీపీపై ఫిర్యాదు చేసేందుకే పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లారని కొందరు అభిప్రాయపడ్డారు. అయితే వాస్తవానికి అది కరెక్ట్ కాదని అర్థమైంది.

పవన్ కల్యాణ్ ఢిల్లీ నుంచి అమరావతి వచ్చాక సీఎం చంద్రబాబును కలిసి ఢిల్లీ పర్యటన విశేషాలను పంచుకున్నారు. అదే సమయంలో హోంమంత్రి అనిత కూడా పవన్ కల్యాణ్ ను కలిసి చర్చించారు. దీంతో అందరూ అనుకున్నట్టు ఆ గ్యాప్ లేదని అర్థమైపోయింది. మరోవైపు బీజేపీకి అవసరమైతే తగిన అండదండలు అందించేందుకు టీడీపీ, జనసేన కూడా తమవంతు సాయం చేసేందుకు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం మహారాష్ట్ర ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ బీజేపీ కోసం ప్రచారం చేయాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నారు. 16, 17 తేదీల్లో మహారాష్ట్ర వెళ్లి అక్కడ బీజేపీ తరపున ప్రచారం చేయబోతున్నారు. దీన్ని బట్టి ఆ మూడు పార్టీల మధ్య దాంపత్యం చాలా అన్యోన్యంగా సాగుతోందని అర్థమవుతోంది.

 

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye Radha Spaces
Tags :