TDP - YCP : వైసీపీ జమిలి ఆశలపై నీళ్లు చల్లిన చంద్రబాబు..!!
ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగి ఆరు నెలలైంది. అటు దేశంలో, ఇటు ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చింది. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైంది. ప్రభుత్వం ఏర్పాటైన మూడు నెలల నుంచే మళ్లీ ఎన్నికలు వస్తాయని.. ఆ ఎన్నికల్లో తమదే గెలుపు అని వైసీపీ ప్రకటనలు చేస్తూ వస్తోంది. ముఖ్యంగా నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2027లో జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమవుతోందని.. వైసీపీ శ్రేణులు కూడా ఇప్పటి నుంచే ఎన్నికలకు సంసిద్ధంగా ఉండాలని ఆ పార్టీ నేతలు సూచిస్తూ వస్తున్నారు. అయితే వైసీపీ ఆశలపై సీఎం చంద్రబాబు నీళ్లు చల్లారు.
2021లో జరగాల్సిన జనగణన కరోనా కారణంగా జరగలేదు. దీంతో ఇప్పుడు జనగణన నిర్వహించి నియోజకవర్గాలను పునర్విభజించేందుకు బీజేపీ ఆలోచిస్తోంది. వచ్చే ఏడాది జనగణనను పూర్తి చేసి 2026లో నియోజకవర్గాలను పునర్విభజించాలని భావిస్తోంది. అయితే దేశంలో నిత్యం ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూ ఉండండతో అభివృద్ధి కుంటుపడుతోదని.. అందుకే దేశవ్యాప్తంగా ఒకేసారి లోక్సభకు, అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ ప్రతిపాదించింది. ఆ వెంటనే వంద రోజుల్లోపు స్థానిక సంస్థలకు కూడా ఎన్నికలు పూర్తి చేసి ఐదేళ్లపాటు పూర్తిగా అభివృద్ధిపైనే ఫోకస్ చేయాలనేది ఆ పార్టీ ఆలోచన. కాబట్టి 2026లో నియోజకవర్గాల పునర్విభజన పూర్తయితే 2027లోనే జమిలి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది.
ఈ వార్త బయటకు రాగానే వైసీపీ ఊపిరి పీల్చుకుంది. చంద్రబాబు ప్రభుత్వంపై మూడు నెలల్లోనే తీవ్ర వ్యతిరేకత వచ్చేసిందని.. వాళ్లు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయట్లేదని ఆరోపించింది. ఇప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీ మళ్లీ విజయం సాధిస్తుందని ప్రకటించింది. ఎలాగూ 2027లో జమిలి ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఆ ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవడం ఖాయమని.. తాము అధికారంలోకి రావడాన్ని ఎవరూ ఆపలేరని ఆ పార్టీ నేతలు చెప్తూ వస్తున్నారు. ఇప్పటి నుంచి ఎన్నికలను ఎదుర్కొనేందుకు అనుగుణంగా నియోజకవర్గాల్లో మార్పులు, చేర్పులు కూడా స్టార్ట్ చేసేశారు ఆ పార్టీ అధినేత జగన్.
అయితే వైసీపీ జమిలి ఆశలపై సీఎం చంద్రబాబు నీళ్లు చల్లారు. అసెంబ్లీ సమావేశాల చివరి రోజు మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన జమిలి ఎన్నికలపైన కూడా స్పందించారు. జమిలి ఎన్నికలైనా జరిగేది 2029లోనే అనే.. ఆలోపు ఎన్నికలు జరిగే అవకాశమే లేదని స్పష్టం చేశారు. ఇదిప్పుడు సంచలనంగా మారింది. ఓ వైపు దేశమంతా 2027లోనే జమిలి ఎన్నికలు జరుగుతాయని ప్రచారం జరుగుతోంది. కానీ ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు మాత్రం 2029లోనే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. కాబట్టి చంద్రబాబు చెప్పిందే నిజమై ఉండొచ్చని అందరూ అనుకుంటారు. మొత్తానికి జమిలి ఎన్నికలు 2027లోనే వచ్చేస్తాయని.. తాము అధికారంలోకి రావడం ఖాయమని భావిస్తున్న వైసీపీ ఆశలపై చంద్రబాబు నీళ్లు చల్లినట్లయింది.