ASBL Koncept Ambience
facebook whatsapp X

PAC : సంప్రదాయానికి చెక్ పెట్టిన చంద్రబాబు..! జగన్‌కు ఝలక్..!!

PAC : సంప్రదాయానికి చెక్ పెట్టిన చంద్రబాబు..! జగన్‌కు ఝలక్..!!

రాజకీయాల్లో ఒకప్పుడు కొన్ని సంప్రదాయాలు ఉండేవి. రాజకీయ నేతలు కూడా వాటిని పాటించేవారు. సంఖ్యాబలంతో సంబంధం లేకుండా వాటిని అమలు చేసేవారు. చట్టం దానికి అనుమతిస్తుందా.. లేదా అనే విషయాలతో సంబంధం లేకుండా సంప్రదాయాన్ని గౌరవించేవారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తొలిసారి ఇలాంటి సంప్రదాయానికి చెక్ పెట్టారు చంద్రబాబు. అరవై ఏళ్లలో పీఏసీ ఛైర్మన్ పదవిని ప్రతిపక్షానికి కాకుండా మిత్రపక్షానికి ఇవ్వడం ద్వారా చంద్రబాబు సరికొత్త సంప్రదాయానికి తెరలేపారు. ఇది అనేక విమర్శలకు దారి తీస్తోంది.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్షం లేదు. ప్రతిపక్ష హోదా దక్కాలంటే కనీసం 18 సీట్లు వచ్చి ఉండాలి. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 11 సీట్లు మాత్రమే దక్కాయి. దీంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు. ఇక సభలో ప్రాతినిధ్యం కలిగిన మూడు పార్టీలూ అధికారంలో భాగస్వాములయ్యాయి. దీంతో ప్రతిపక్షం అనేదే లేకుండా పోయింది. అయితే ప్రజా పద్దుల కమిటీ (పబ్లిక్ అకౌంట్స్ కమిటీ – PAC) ఛైర్మన్ పదవిని ప్రతిపక్షానికి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అరవై ఏళ్లలో ఒక్కసారి కూడా ఈ పదవి ప్రతిపక్షానికి కాకుండా అధికార భాగస్వామ్య పార్టీ తీసుకోలేదు.

ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా కనీసం పీఏసీ ఛైర్మన్ పదవినైనా కచ్చితంగా చంద్రబాబు ప్రభుత్వం ఇస్తుందని వైసీపీ ఆశించింది. అందుకే వైసీపీ తరపున పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఈ పదవికి నామినేషన్ వేశారు. అయితే కమిటీలో సభ్యత్వం కోసం 12 మంది అధికార పార్టీల నుంచి కూడా నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో ఎన్నిక అనివార్యమైంది. ఎన్నికలో 12 మందీ అధికార పార్టీల సభ్యులే విజయం సాధించారు. అందులో నుంచి పీఏసీ ఛైర్మన్ గా జనసేన ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులును స్పీకర్ ఎంపిక చేశారు. దీంతో పీఏసీ ఛైర్మన్ పదవి కూడా అధికార పార్టీకే చెందింది. అరవై ఏళ్ల చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి.

పీఏసీ చాలా కీలకమైన కమిటీ. ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపే కమిటీ. దీన్ని కూడా అధికార పార్టీ తమ చెప్పుచేతల్లో ఉంచుకుంటే తప్పిదాలను ఎత్తిచూపే ఆస్కారం ఉండదు. ఇదే అంశాన్ని వైసీపీ చెప్తోంది. బోఫోర్స్, స్పెక్ట్రమ్, కోల్ గేట్ లాంటి కుంభకోణాలను వెలికితీసిన చరిత్ర పీఏసీకి ఉందని వెల్లడించింది. కానీ చంద్రబాబు మాత్రం ఏపీలో అలాంటి అవకాశం లేకుండా పీఏసీని తమ చెప్పుచేతల్లో ఉంచుకున్నారని ఆరోపిస్తోంది. సంఖ్యాబలం లేదనే కారణంలో తమకు పీఏసీ ఛైర్మన్ ఇవ్వకపోవడం సరికాదని విమర్శిస్తోంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీకి 30 సీట్లే వచ్చినా పీఏసీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తోంది. ఏదేతైనేం.. పీఏసీ విషయంలో చంద్రబాబు సరికొత్త సంప్రదాయానికి తెరదీశారు. మున్ముందు ఇది ఎలాంటి మలుపులు తీసుకుంటుందనేది ఆసక్తి కలిగిస్తోంది.

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :