Pawan Kalyan : చంద్రబాబు చేయలేని పని పవన్ చేస్తున్నారా..?
ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ ఇందులో భాగస్వాములు. టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం, జనసేన శ్రేణులు అనేక ఇబ్బందులు పడ్డాయి. చాలా మంది వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించాలని కంకణం కట్టుకుని మరీ పనిచేశారు. ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా వాటిని ఎదుర్కొన్నారు. అందుకే వైసీపీ ఓడిపోయి తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమను ఇబ్బంది పెట్టిన వాళ్ల అంతు చూడాలనుకున్నారు. వాళ్లు అనుకున్నట్టే జగన్ ఓడిపోయారు. వీళ్లు అధికారంలోకి వచ్చారు. కానీ వీళ్లు అనుకున్నట్టు పాలన సాగట్లేదు.
చంద్రబాబు, పవన్ అధికారంలోకి వచ్చి ఆరు నెలలైంది. మొదటి ఐదు నెలలూ పాలన అస్తవ్యస్తంగా సాగిందనే చెప్పాలి. వైసీపీ ప్రభుత్వం చక్రం తిప్పిన అధికారులు, ఉద్యోగులే మళ్లీ చక్రం తిప్పడం ప్రారంభించారు. కీలక స్థానాల్లో వాళ్లే తిష్ట వేశారు. సోషల్ మీడియాలో ఈ నియామకాలపై అనేక విమర్శలు వచ్చాయి. అయినా చంద్రబాబు చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వం మారింది కానీ జగనే ఇంకా పరిపాలిస్తున్నారనే విధంగా సెటైర్లు వేయడం మొదలు పెట్టారు. లోకేశ్ రెడ్ బుక్ ఏమైందని తెలుగు తమ్ముళ్లు నేరుగా ప్రశ్నించారు. కారణాలేంటో తెలీదు కానీ చంద్రబాబు, లోకేశ్ పాలనపై గ్రిప్ కోల్పోయినట్లు అనిపించింది.
ఇలాంటి సమయంలో పవన్ కల్యాణ్ జులుం విదిలించారనే చెప్పాలి. పరిపాలన అనుకున్నట్టు సాగట్లేదని పవన్ గ్రహించారు. ఈ పాలనకోసమా తాము అధికారంలోకి వచ్చిందని భావించారు. అందుకే తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఇప్పటికీ అనేక మంది అసభ్యకరంగా కుటుంబసభ్యులను కించపరుస్తున్నారని.. అయినా చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని హోంమంత్రి అనితను నిలదీశారు. ఇలాగైతే తానే హోంమంత్రిని అవుతానని హెచ్చరించారు. దీంతో ఒక్కసారిగా అందరూ ఖంగుతిన్నారు. సీఎం చంద్రబాబు.. పవన్ ను, అనితను పిలిపించుకుని మాట్లాడారు. అప్పటి నుంచి సోషల్ మీడియా అరెస్టులు మొదలయ్యాయి. ఒక్కొక్కరి తాట తీయడం మొదలైంది.
ఇప్పుడు బియ్యం అక్రమ రవాణాపై పవన్ కొరడా ఝళిపించారు. నెల రోజులుగా తనను పోర్టుకు రాకుండా అడ్డుకుంటురన్నారని.. దీన్ని బట్టి ఇక్కడ పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. తన పర్యటనకు ఎస్పీ గైర్హాజరు కావడాన్ని కూడా ఆయన ఎత్తి చూపారు. అందరి ముందే అధికారులను, స్థానిక ఎమ్మెల్యేను నిలదీశారు. పవన్ యాక్షన్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. లీడర్ అంటే ఆయనలా ఉండాలని సోషల్ మీడియాలో పోస్టులు తిరుగుతున్నాయి. చంద్రబాబు, లోకేశ్ చేయలేని పని పవన్ కల్యాణ్ చేస్తున్నారంటూ తెలుగు తమ్ముళ్లే కొనియాడుతున్నారు. అవినీతి, అక్రమాలు ఎవరు చేసినా, వాళ్లు ఎంతటివారైనా చర్యలు తీసుకోవాలని పవన్ స్పష్టం చేస్తున్నారు. మొత్తంగా చంద్రబాబు సాఫ్ట్ నెస్ తెలుగు తమ్ముళ్లకు నచ్చట్లేదు. పవన్ లాంటి దూకుడును వాళ్లు ఆశిస్తున్నారు. మరి పవన్ ను చూసిన తర్వాతైనా చంద్రబాబు, లోకేశ్ మేల్కొంటారమో చూడాలి.