ASBL Koncept Ambience
facebook whatsapp X

బీఆర్ఎస్‌ను బతికిస్తున్న రేవంత్ రెడ్డి..!?

బీఆర్ఎస్‌ను బతికిస్తున్న రేవంత్ రెడ్డి..!?

తెలంగాణలో పదేళ్లపాటు అధికారంలో ఉంది భారత్ రాష్ట్ర సమితి. తెలంగాణను సాధించిన ఘనత కచ్చితంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దే. పదేళ్లపాటు అన్నీ తామై వ్యవహరించింది ఆ పార్టీ. అయితే ఇప్పుడు ఆ పార్టీ ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అసెంబ్లీలో ప్రతిపక్ష స్థానం దక్కించుకున్న బీఆర్ఎస్.. లోక్ సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. దీంతో అందరూ ఆ పార్టీ పనైపోయిందనుకున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డే ఆ పార్టీకి మళ్లీ ఊపిరి పోస్తున్నట్టు అర్థమవుతోంది.

లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా దక్కించుకోలేదు. కాంగ్రెస్ కు 8, బీజేపీకి 8 సీట్లు దక్కాయి. ఓట్లలో కూడా మూడో స్థానానికి పరిమితమైంది బీఆర్ఎస్. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో కచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేస్తారని అందరూ అంచనా వేశారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కొందరు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. త్వరలోనే మరికొంతమంది ప్రజాప్రతినిధులు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని.. కేసీఆర్ కు ప్రతిపక్ష నేత హాదా కూడా దక్కకుండా చేస్తారని అనుకున్నారు.

అయితే ఇదంతా ఒక కోణం. ఇప్పటికీ బీఆర్ఎస్ ను బలహీన పరిచేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తూనే ఉన్నారు. అదే సమయంలో అదే రేవంత్ రెడ్డి ఆ పార్టీ బలపడేందుకు దోహదపడుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఓ వైపు బీఆర్ఎస్ ను బలహీన పరుస్తూనే రేవంత్ రెడ్డి తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ఆ పార్టీకి ఊపిరిపోస్తున్నాయని చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ గ్యారంటీ స్కీంలతో అధికారంలోకి వచ్చింది. అయితే వాటిని అమలు చేశామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పుకుంటుంటే.. బీఆర్ఎస్ మాత్రం జరగట్లేదని విమర్శిస్తోంది.

రుణమాఫీ విషయంలో ప్రజలను రేవంత్ రెడ్డి మోసం చేశారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇందుకు తగిన ఆధారాలు కూడా చూపిస్తోంది. ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ కాలేదని.. అదే సమయంలో కొంతమంది అనర్హులకు రుణ మాఫీ జరిగిందని చెప్తోంది. అంతేకాక.. అందరికీ రుణమాఫీ చేయాలంటూ ఉద్యమాలకు శ్రీకారం చుట్టింది. ఇలాంటివి బీఆర్ఎస్ పార్టీ మళ్లీ ఊపిరి పీల్చుకోవడానికి దోహదపడుతున్నాయి. బీఆర్ఎస్ కూడా నేరుగా జనాల్లోకి వెళ్లేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తోంది. నాయకులు వెళ్లిపోయినా జనాలతో ఉంటే వాళ్లే ఆదుకుంటారనే నమ్మకంతో ముందుకెళ్తోంది. సీఎం రేవంత్ రెడ్డే బీఆర్ఎస్ కు ఊపిరి పోసేలా అవకాశమిస్తున్నారనే టాక్ నడుస్తోంది.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :