Master Plan : బీఆర్ఎస్‌ను ఇరికించేందుకు బీజేపీని లాగుతున్న రేవంత్ రెడ్డి..!?
తెలంగాణలో ట్రయాంగిల్ వార్ నడుస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటూ రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నాయి. మూడు పార్టీలూ వేటికవే పట్టుకోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా ఇరుకున పెట్టి లబ్ది పొందాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ ట్రై చేస్తోంది. ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్ లను ఎండగట్టడం ద్వారా ప్రయోజనం పొందాలని బీజేపీ అనుకుంటోంది. అయితే బీఆర్ఎస్, బీజేపీ కలిసి తమను ఇబ్బంది పెడతాయేమోననే భయం కాంగ్రెస్ ను వెంటాడుతోంది. అందుకే ఆ రెండు పార్టీలూ కలవకుండా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
తెలంగాణలో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విచారణ జరుగుతోంది. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పలువురు ప్రముఖల ఫోన్లను ట్యాప్ చేసి లబ్ది పొందిందనే ఆరోపణలున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే దీనిపై కేసు నమోదు చేసింది. పలువురు పోలీస్ అధికారులను సస్పెండ్ చేసి విచారణ జరిపింది. ఈ కేసులో ఇప్పుడు బీఆర్ఎస్ కు చెందిన పలువురు నేతల పేర్లు కూడా బయటకు వచ్చాయి. తాజాగా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను కూడా సీఐడీ విచారణకు పిలిచింది. మరికొందరి పేర్లను కూడా ఈ జాబితాలో చేర్చి విచారణకు పిలుస్తోంది.
ఫార్ములా ఈ-రేసు కేసులో నాటి మంత్రి కేటీఆర్ ను విచారించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కేటీఆర్ ను విచారించి.. అవసరమైతే అరెస్టు చేసేందుకు గవర్నర్ అనుమతి కూడా కోరింది. అయితే ఇప్పటివరకూ కేటీఆర్ పై ముందుకు వెళ్లేందుకు గవర్నర్ నుంచి ఎలాంటి అనుమతీ రాలేదు. ఇంతలో కేటీఆర్ ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలిశారు. దీంతో అరెస్టు నుంచి తప్పించేందుకు కేటీఆర్ ఢిల్లీ వెళ్లి బీజేపీ నేతల కాళ్లమీద పడ్డారని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. ఒకవేళ బీజేపీ కాళ్లపై పడి బేరం కుదిరితే ఆ రెండు పార్టీలూ ఒక్కటవుతాయేమోననే భయం కాంగ్రెస్ ను వెంటాడుతోంది.
అందుకే రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. నాడు ఫాంహౌస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బీజేపీ నేతలు చేసిన రాయబారాల వ్యవహారాన్ని తెరపైకి తీసుకువస్తున్నట్టు తెలుస్తోంది. నాడు బీజేపీ నేతల ఫోన్లు ట్యాప్ చేయడం వల్లే ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని రుజువు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. బీజేపీ నేత బీ.ఎల్.సంతోష్ ను అరెస్టు చేసేందుకు అప్పటి కేసీఆర్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించింది. ఈ అంశంపై అప్పట్లో బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పడు దీన్ని లైమ్ లైట్ లోకి తీసుకురావడం ద్వారా బీఆర్ఎస్ తో బీజేపీ లాలూచీ పడకుండా జాగ్రత్త పడేందుకు రేవంత్ వ్యూహం పన్నినట్లు సమాచారం.