ASBL Koncept Ambience
facebook whatsapp X

టీడీపీ, జనసేన యాక్టివిస్టుల సంగతేంటి చంద్రబాబు గారూ...!?

టీడీపీ, జనసేన యాక్టివిస్టుల సంగతేంటి చంద్రబాబు గారూ...!?

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు సోషల్ మీడియా హడావుడి బాగా నడుస్తోంది. సోషల్ మీడియాలో రెచ్చిపోయి అడ్డగోలుగా పోస్టులు పెట్టి వ్యక్తిగత హననానికి పాల్పడిన ఎంతోమంది యాక్టివిస్టులను ఇప్పుడు ప్రభుత్వం అరెస్టు చేస్తోంది. జైళ్లకు పంపిస్తోంది. సోషల్ మీడియాలో ఎవరైనా అసత్య కథనాలు, బూతులు, మార్ఫింగులు చేసి వ్యక్తిగత ఇమేజ్ ని దెబ్బతీస్తే కచ్చితంగా అలాంటి వాళ్లందరిపైనా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హెచ్చరించారు. వైసీపీ వాళ్లు మాత్రమే కాదని.. సొంత పార్టీ నేతలు ఈ తప్పు చేసినా వాళ్లను కూడా అరెస్టు చేస్తామని స్పష్టం చేస్తారు. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం వేరేలా ఉంది.

2019 నుంచి 2024 మద్య వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ, జనసేన నేతలు, వాళ్ల కుటుంబ సభ్యులను టార్గెట్ గా చేసుకుని వైసీపీ నేతలు, కార్యకర్తలు అసభ్య పోస్టులు పెట్టారు. ముఖ్యంగా సజ్జల భార్గవ్ రెడ్డి వైసీపీ డిజిటల్ మీడియా బాధ్యతలు చేపట్టాక ఈ పోస్టుల పరంపర విచ్చలవిడిగా కొనసాగిందనే టాక్ ఉంది. అప్పట్లోనే ఈ పోస్టులపై వైసీపీ, జనసేన నేతలు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. కానీ అప్పుడు ప్రభుత్వం చొరవ తీసుకోకపోవడంతో ఎవరినీ అరెస్టు చేయలేదు. వాళ్లపైన చర్యలు కూడా తీసుకోలేదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని టీడీపీ, జనసేన నేతలు.. తాము అధికారంలోకి వస్తే కచ్చితంగా అలాంటి వాళ్లందరిపైనా చర్యలు తప్పవని అప్పడే హెచ్చరించారు.

అన్నట్టుగానే ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. అప్పుడు రెచ్చిపోయి పోస్టులు పెట్టిన వైసీపీ వాళ్లందరినీ ఇప్పుడు బొక్కలో తోస్తున్నారు. దీనిపై టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు సంతృప్తిగా ఉన్నారు. అయితే తమపై అసభ్య పోస్టులు పెట్టిన టీడీపీ, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టుల సంగతేంటని ఇప్పుడు వైసీపీ ప్రశ్నిస్తోంది. అప్పుడు మేం ఫిర్యాదు చేసినా మీరు పట్టించుకోలేదు కదా అని టీడీపీ బదులిస్తోంది. అధికారంలో ఉండడంతో ఇప్పటికీ కొంతమంది టీడీపీ, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు వైసీపీని టార్గెట్ గా చేసుకుని అసభ్య పోస్టులు పెడుతున్నారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని.. తాము అధికారంలోకి వస్తే సప్తసముద్రాల ఆవల ఉన్నా తీసుకొస్తామని ఇప్పటికే జగన్ హెచ్చరించారు.

సోషల్ మీడియా అరెస్టుల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం పక్షపాత ధోరణి అవలంబిస్తోందని ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా పోస్టులు పెట్టిన వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్టు చేసి ఉంటే అర్థముండేది. గతంలో పెట్టిన పోస్టులను చూపించి ఇప్పుడు అరెస్టు చేస్తున్నారు. మరి అప్పట్లో అసభ్య పోస్టులు పెట్టిన టీడీపీ, జనసేన నేతలను కూడా అరెస్టు చేసి చర్యలు తీసుకుంటో మొత్తం వ్యవస్థే గాడిన పడేది. అలా కాకుండా పక్షపాత దోరణితో ఇలా ఒక పార్టీ వాళ్లనే అరెస్టు చేస్తే రేపు వాళ్లు అధికారంలోకి రాగానే మళ్లీ వీళ్లను అరెస్టు చేయవచ్చు. అంతేకానీ సోషల్ మీడియా ట్రోలింగ్స్ కు శాశ్వత పరిష్కారం మాత్రం దొరకదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుని అసభ్య పోస్టులు ఎవరు పెట్టినా తరతమ బేధం లేకుండా చర్యలు తీసుకుంటే బాగుంటుంది.

 

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye Radha Spaces
Tags :