Social Media : సోషల్ మీడియా అరెస్టులు... ఇది న్యాయమేనా సీఎం గారూ..?
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన వాళ్ల భరతం పడుతోంది ప్రభుత్వం. వారం, పది రోజుల వ్యవధిలోనే వందల మందిపై కేసులు నమోదయ్యాయి. పదుల సంఖ్యలో అరెస్టులు జరిగాయి. కొంతమంది జైళ్లకు కూడా వెళ్లాల్సి వచ్చింది. ఎక్కువ మందికి 41ఏ నోటీసులు ఇచ్చి పంపించేశారు పోలీసులు. అయితే ఈ అరెస్టులపై వైసీపీ తీవ్రంగా మండిపడుతోంది. తమ పార్టీ వాళ్లను మాత్రమే అరెస్టు చేస్తున్నారని.. టీడీపీ, జనసేన వాళ్లపై ఎందుకు కేసులు పెట్టట్లేదని ప్రశ్నిస్తోంది. నమోదైన కేసులను బట్టి చూస్తే వైసీపీ ఆరోపణల్లో నిజం ఉందనిపిస్తోంది.
ఏపీలో 2019-24 మధ్య జగన్ నేతృత్వంలో వైసీపీ అధికారంలో ఉండేది. ఆ సమయంలో ఐప్యాక్ సంస్థ వాళ్లకు సలహాదారుగా పనిచేసింది. ఆ సంస్థ ఇచ్చిన సలహాలు, సూచనల మేరకు సోషల్ మీడియాలో విచ్చలవిడిగా అకౌంట్లు ఓపెన్ అయ్యాయి. వాళ్లంతా ఒక పద్ధతి ప్రకారం అప్పటి విపక్షాలైన టీడీపీ, జనసేనను టార్గెట్ చేసి పోస్టులు పెట్టేవారు. ఒక స్థాయికి వచ్చాక పరిధి దాటి వ్యక్తిగత హననానికి పాల్పడేలా అసభ్య పోస్టులు కూడా పెట్టారు. మార్ఫింగులు చేసి కించపరిచారు. దీంతో టీడీపీ, జనసేన అప్పట్లోనే వైసీపీ సోషల్ మీడియా పోస్టులపై పోలీసులకు ఫిర్యాదులు చేశాయి. కానీ అప్పుడు పోలీసులు అస్సలు పట్టించుకోలేదు.
ఇప్పుడు వైసీపీ ఓడిపోయి ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు సీఎం అయ్యాక సోషల్ మీడియాపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అసభ్య పోస్టులు పెట్టిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో చాలా మంది టీడీపీ, జనసేన నేతలు నాటి వైసీపీ పోస్టులను బయటపెడుతున్నారు. అలా పోస్టులు పెట్టిన వాళ్లపై కేసులు నమోదు చేయిస్తున్నారు. దీంతో అలా పోస్టులు పెట్టిన వాళ్లందరినీ పోలీసులు అరెస్టు చేస్తున్నారు. కొంతమందిని జైళ్లకు పంపిస్తున్నారు. మరికొందరికి నోటీసులు ఇచ్చి విడిచి పెడుతున్నారు. ఇప్పుడు వైసీపీ కూడా గగ్గోలు పెడుతోంది. తమపై టీడీపీ, జనసేన నేతలు, అభిమానులు పెట్టిన పోస్టులపై ఫిర్యాదులు చేస్తోంది. అయితే ఇప్పటి చంద్రబాబు ప్రభుత్వం అస్సలు పట్టించుకోవట్లేదు.
అప్పుడు వాళ్లు కేసులు పెట్టలేదు.. ఇప్పుడు వీళ్లు పట్టించుకోవట్లేదు. చెల్లుకు చెల్లు..! ఇలా అనుకోవడంలో తప్పు లేదు. కానీ సీఎం చంద్రబాబు అలా చెప్పలేదు. అసభ్యంగా ఎవరు పోస్టులు పెట్టినా చర్యలు తీసుకోవాలని చెప్పారు. సొంత పార్టీ వాళ్లు తప్పు చేసినా వదిలి పెట్టేది లేదన్నారు. కానీ పోలీసులు టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలను మాత్రం అరెస్టు చేయట్లేదు. వైసీపీ చేసిన ఫిర్యాదులను పట్టించుకోవట్లేదు. ఇదే అసలు సమస్య. గతంలో జగన్ నిష్పక్షపాతంగా వ్యవహరించలేదు కాబట్టే దారుణంగా ఓడిపోయారు. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే బాటలో పయనిస్తున్నారు. సోషల్ మీడియాలో అసభ్యతకు చెక్ పెట్టాలంటే పార్టీలకతీతంగా చర్యలు ఉండాలి. లేకుంటే ఇలాంటి అరెస్టుల పరంపర నిత్యం కొనసాగుతూనే ఉంటుంది. గతంలో టీడీపీ, జనసేన వాళ్లపై కేసులు పెట్టారు. ఇప్పుడు వైసీపీ వాళ్లపై పెడుతున్నారు. రేపు వాళ్లు మళ్లీ వస్తే మీపై కేసులు పెడ్తారు. ఇది కాదు కదా ప్రజాస్వామ్యం. తప్పు ఎవరు చేసినా చర్యలు తీసుకోవాల్సిందే కదా..! ఈ విషయంలో సీఎం చంద్రబాబు కాస్త ఆలోచించాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఆయన మాటకు విలువ లేనట్టుగానే భావించాల్సి ఉంటుంది.