ASBL NSL Infratech

ప్రత్యేక హోదానా..? ప్యాకేజీయా..? చంద్రబాబు ముందు సరికొత్త సవాల్..!!

ప్రత్యేక హోదానా..? ప్యాకేజీయా..? చంద్రబాబు ముందు సరికొత్త సవాల్..!!

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే అంశం పదేళ్లుగా నానుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోతున్న సమయంలో లోటు బడ్జెట్ కలిగిన ఏపీని ఆదుకోవాలంటే ప్రత్యేక హోదా ఇవ్వాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. దీనిపై అప్పటి ముఖ్యమంత్రి మన్మోహన్ సింగ్ పార్లమెంటులో ప్రకటన కూడా చేశారు. అయితే ఆ తర్వాత జరిగిన అనేక పరిణామాల నేపథ్యలో ఈ అంశం అనేక మలుపులు తిరిగి మరుగున పడిపోయింది. అయితే ఇప్పుడు బీహార్ లో మరోసారి ప్రత్యేక హోదా అంశం తెరపైకి రావడంతో ఏపీకి కూడా స్పెషల్ స్టేటస్ ఇవ్వాలనే ప్రతిపాదన మళ్లీ రాజుకుంటోంది. మరి దీనిపై చంద్రబాబు ఏం చేస్తారు..?

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంటులో హామీ ఇచ్చింది. సాక్షాత్తూ ప్రధాని మన్మోహన్ సింగ్ దీనిపై ప్రకటన చేశారు. అయితే ఈ అంశాన్ని విభజన చట్టంలో పొందు పరచలేదు. దీంతో ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. అయితే అప్పుడు మోదీ ప్రభుత్వంలో భాగమైన టీడీపీ ప్రభుత్వం మొదట ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టింది. అయితే అప్పటి పరిస్థితుల ప్రకారం హోదా ఇచ్చేందుకు వీలు కాదని.. ప్యాకేజీ ఇస్తామని మోదీ ప్రభుత్వం సూచించింది. దీనికి అంగీకరించిన చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీతో సర్దుకుపోయారు.

అయితే బీజేపీతో విభేదాల కారణంగా ఏడాదిన్నర ముందే ఎన్డీయే ప్రభుత్వం నుంచి టీడీపీ వైదొలిగింది. ఆ సమయంలో మళ్లీ తమకు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ టీడీపీ ఉద్యమించడం మొదలుపెట్టింది. అయితే ఇప్పటికే హోదాపై క్లారిటీ ఇచ్చామని.. దాని స్థానంలో ఏపీకి ప్యాకేజీ అమలు చేస్తున్నామని మోదీ ప్రభుత్వం స్పష్టం చేసింది. యూటర్న్ తీసుకున్న చంద్రబాబు హోదా కోసం ఉద్యమించినా ఉపయోగం లేకుండా పోయింది. ఇదే సమయంలో టీడీపీ ఓడిపోయి వైసీపీ అధికారంలోకి వచ్చింది. మొదటి నుంచి హోదాయే తమ ప్రయారిటీ అని చెప్పుకుంటూ వచ్చిన వైసీపీ.. దానికోసం పెద్దగా ప్రయత్నించలేదనే విమర్శలున్నాయి.

మొదటి ఐదేళ్లు చంద్రబాబు, ఆ తర్వాత ఐదేళ్లు జగన్ ప్రత్యేక హోదాని పట్టించుకోలేదు. దీంతో ఇప్పటికీ ఆ వ్యవహారం అలాగే ఉండిపోయింది. ఇప్పుడు కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి టీడీపీ, జేడీయూ కీలక భాగస్వాములుగా ఉన్నారు. ఇప్పుడు బీహార్ కు ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ ఇవ్వాలని నితీశ్ కుమార్ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా అంశం మరోసారి తెరపైకి వచ్చింది. నితీశ్ తో పాటు చంద్రబాబు కూడా హోదా కోసం కేంద్రాన్ని అడుగుతారా.. అడగరా.. అనేది ఆసక్తి రేపుతోంది. ఇప్పటికీ ప్రత్యేక హోదా అంశం ఏపీలో సెంటిమెంటుగా ఉంది. వైసీపీ కూడా ఈ అంశాన్ని డిమాండ్ చేస్తోంది.  మోదీ ప్రభుత్వ మనుగడ చంద్రబాబు, నితీశ్ పై ఆధారపడి ఉంది. వీళ్లిద్దరూ గట్టిగా అడిగితే ఇవ్వొచ్చనే టాక్ వినిపిస్తోంది. మరి చంద్రబాబు ఏం చేస్తారనేది వేచి చూడాలి. 

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :