ASBL Koncept Ambience
facebook whatsapp X

Telangana BJP: తెలంగాణ బీజేపీకి ఏమైంది..?

Telangana BJP: తెలంగాణ బీజేపీకి ఏమైంది..?

తెలంగాణలో (Telangana) ముక్కోణపు పోరు నడుస్తోంది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్ (Congress), బీజేపీతో పాటు ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ కూడా ఇక్కడ బలంగా ఉంది. అందుకే ఈ మూడు పార్టీల మధ్య ట్రయాంగిల్ వార్ నడుస్తోంది. పదేళ్లపాటు బీఆర్ఎస్ అధికారంలో ఉండగా.. తాజా ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైంది. బీఆర్ఎస్ పనైపోయిందని.. ఇక అధికారంలోకి వచ్చేది తామేనని ఇన్నాళ్లూ రెచ్చిపోయిన బీజేపీ ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. అసలు ఆ పార్టీ తెలంగాణలో ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

గతేడాది డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాలు గెలుచుకుంది. ఈ ఏడాది లోక్ సభ ఎన్నికల్లో 8 స్థానాలను గెలుచుకుని సత్తా చాటింది. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా దక్కించుకున్న బీఆర్ఎస్ లోక్ సభ ఎన్నికల్లో ఒక్క సీటును కూడా దక్కించుకోలేకపోయింది. లోక్ సభలో ప్రాతినిధ్యం కూడా కోల్పోయింది. దీంతో ఇకపై కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ ఉంటుందని భావించారు. బీఆర్ఎస్ పనైపోయిందని అంచనా వేశారు. అయితే ఇప్పుడు పరిస్థితులు చూస్తే బీజేపీ దరిదాపుల్లో కూడా కనిపించలేదు.

తాజా ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చింది. అదే సమయంలో తెలంగాణలో (Telangana) కూడా 8 సీట్లు రావడంతో తెలంగాణ నుంచి ఇద్దరికి కేంద్ర కేబినెట్లో (Central Cabinet) స్థానం కల్పించింది బీజేపీ హైకమాండ్. బీఆర్ఎస్ పనైపోయిందని.. ఇక కాంగ్రెస్ ను టార్గెట్ చేయాలని హైకమాండ్ స్పష్టమైన సంకేతాలిచ్చింది. పార్టీ నేతలంతా సమన్వయంతో పనిచేస్తే తప్పకుండా అధికారంలోకి రావచ్చని సూచించింది. అయితే ఎన్నికల ముందు ఎలాంటి అంతర్గత విభేదాలతో ఆ పార్టీ ఇబ్బంది పడిందో.. ఆ తర్వాత కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. నేతల మధ్య ఇప్పటికీ సమన్వయం లేదు.

తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను అందిపుచ్చుకుని ఉద్యమించడంలో బీజేపీ (BJP) పూర్తిగా వైఫల్యం చెందింది. హైడ్రా మొదలు పెట్టినప్పుడు బీజేపీ స్వాగతించింది. అక్రమ కట్టడాలను కూల్చేయాలని డిమాండ్ చేసింది. అయితే ఇప్పుడు హైడ్రాపై (HYDRA) వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో మొదట్లో దాన్ని సమర్థించాం కాబట్టి ఇప్పుడు దానికి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితిని బీజేపీ కోల్పోయింది. దాన్ని పక్కన పెడితే మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ (Musi river front development) పేరుతో రేవంత్ సర్కార్ ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. దీని వల్ల మూసిని ఆనుకుని నివాసముంటున్న ఎంతోమంది పేదలు నిరాశ్రయలు కాబోతున్నారు. దీన్ని క్యాష్ చేసుకోవడంలో కూడా బీజేపీ వెనుకబడింది.

అదే సమయంలో బీఆర్ఎస్ పనైపోయిందని భావించిన బీజేపీ, కాంగ్రెస్ లకు గులాబీ పార్టీ గట్టి ఝలక్ ఇచ్చింది. రేవంత్ సర్కార్ (Revanth Reddy Govt) ను ముప్పతిప్పలు పెడుతోంది. ప్రతిరోజూ ప్రజల్లో ఉంటూ పాలకులను టార్గెట్ చేస్తోంది. రేవంత్ వైఫల్యాలను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ కేడర్ లో ఉత్సాహం నింపుతోంది. అదే సమయంలో ప్రజల్లో కూడా విశ్వాసం కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. కానీ బీజేపీ మాత్రం ప్రజల్లోకి వెళ్లలేకపోతోంది. అయితే బీఆర్ఎస్ తో కుమ్మక్కై బీజేపీ సైలెంట్ గా ఉంటోందనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. ఇది బీజేపీ (BJP), బీఆర్ఎస్ (BRS) ఉమ్మడి వ్యూహమనే వాళ్లూ లేకపోలేదు. ఏదైతేనేం.. బీజేపీ మాత్రం తెలంగాణలో అవకాశాలను మిస్ చేసుకుంటూ వెనుకబడిపోతోంది.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :