ASBL Koncept Ambience
facebook whatsapp X

విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ఊపిరి..!! కేంద్రం ఏం చేయబోతోంది..!?

విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ఊపిరి..!! కేంద్రం ఏం చేయబోతోంది..!?

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది జగమెరిగిన నినాదం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది సెంటిమెంటుతో కూడిన వ్యవహారం. ఇప్పుడు ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ చిక్కుల్లో పడింది. మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. దీన్ని గట్టెక్కించడం ఎలాగో అర్థం కాక అందరూ తలలు పట్టుకుంటున్నారు. నవరత్నాల్లో ఒకటిగా ఉన్న ఈ కంపెనీని వదిలించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అదే జరిగితే మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందనే భయం కొన్ని పార్టీలకు ఉంది. అందుకే ప్రత్యామ్నాయంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని బతికించేందుకు ఉన్న మార్గాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

విశాఖ స్టీల్ ప్లాంట్ గత ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా మారింది. ఈ ప్లాంటును మూసి వేయొద్దని.. లేదంటే ప్రైవేటుపరం చేయొద్దని అన్ని పార్టీలూ డిమాండ్ చేస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను వదిలించుకోవాలనే పట్టుదలతో ఉంది. అలాంటి కంపెనీల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ఒకటి. దీన్ని కొనేందుకు కొన్ని ప్రైవేటు కంపెనీలు సుముఖంగా ఉండడంతో ఇది చేజారిపోతుందేమోననే భయం ఉద్యోగుల్లో, కార్మికుల్లో ఉంది. అందుకే ప్రైవేటీకరణ అంశం తెరపైకి వచ్చినప్పటి నుంచి కార్మికులు ఉద్యమిస్తున్నారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి కూడా విశాఖ వచ్చి వెళ్లారు.

తాజాగా ప్లాంట్ లోని ఫర్నేస్ ప్లాంట్ మూతపడింది. సరిపడా బొగ్గు సరఫరా లేకపోవడంతో ఉత్పత్తి ముందుకు సాగడం లేదు. స్టీల్ ప్లాంట్ సీఎండీ అతుల్ భట్ ను ప్రభుత్వం సెలవుపై పంపించింది. మరోవైపు ఢిల్లీలో ఉక్కుప్లాంటును ఏం చేయాలనేదానిపై సుదీర్ఘ చర్చలు జరుగుతున్నాయి. దీంతో ప్రైవేటీకరణ ఖాయమనేలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రైవేటీకరణకు రంగం సిద్ధమవుతుంటే టీడీపీ ఏం చేస్తోందనేలా ట్వీట్ చేశారు. గతంలో తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ నిరాహార దీక్ష చేశారని గంటా శ్రీనివాస్ బదులిచ్చారు. ఇప్పుడు వైసీపీ నేతలు ఎందుకు రాజీనామాలు చేయట్లేదని ప్రశ్నించారు.

అయితే స్టీల్ ప్లాంట్ ను ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేస్తే ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతో ఉన్నాయి ఎన్డీయే పార్టీలు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీకి ఇది ఎంతో ప్రతిష్టాత్మక వ్యవహారం. అందుకే స్టీల్ ప్లాంట్ ను ఎట్టిపరిస్థితిల్లో ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటున్నాయి. దీంతో కేంద్రం కూడా ప్రైవేటీకరణ జోలికి పోకుండా అటు నష్టాల నుంచి గట్టెక్కేలా ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా ఖర్చులను భారీగా తగ్గించుకునేందుకు ఉద్యోగులకు స్వచ్ఛంధ పదవీ విరమణకు అవకాశం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఉద్యోగులను తగ్గించుకోవడం ద్వారా మిగిలిన ఉద్యోగులతో తక్కువ ఖర్చుతో ప్లాంట్ నడపొచ్చనేది కేంద్రం ఆలోచనగా ఉంది. ప్రస్తుతానికి విశాఖ స్టీల్ ప్లాంట్ కు రూ.3వేల కోట్లు ఇచ్చి ఆదుకునేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్టు సమాచారం.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :