ASBL Koncept Ambience
facebook whatsapp X

టీడీపీని నమ్ముకుంటే ఇంతేనా..! వైసీపీ నేతల్లో అంతర్మథనం..!?

టీడీపీని నమ్ముకుంటే ఇంతేనా..! వైసీపీ నేతల్లో అంతర్మథనం..!?

ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలలైంది. ఈ మూడు నెలలు ఆరంభ కష్టాలను అధిగమించేందుకే ప్రభుత్వానికి సమయం సరిపోవట్లేదు. పాలనా యంత్రాంగాన్ని దారికి తెచ్చుకునేందుకు అవసరమైన చర్యల్లో ప్రభుత్వం నిమగ్నమైంది. ఇంతలో వరదలు రావడంతో పూర్తిగా అటువైపు ఫోకస్ పెట్టాల్సి వచ్చింది. అయితే ఈలోపే కొంతమంది వైసీపీ నేతలు ఆ పార్టీకి రాజీనామా చేసేశారు. అధికార పార్టీల్లో చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే చేరికలు మాత్రం ముందుకు సాగట్లేదు. దీంతో రాజీనామా చేసిన నేతల్లో అంతర్మథనం మొదలైనట్లు సమాచారం.

గత ఐదేళ్లపాటు అధికారంలో ఉంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. అప్పుడు కీలకంగా వ్యవహరించిన కొంతమంది నేతలు ఇప్పుడు ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. కీలకపదవుల్లో ఉన్న నేతలు సైతం హైకమాండ్ తీరుపై అసంతృప్తితో పార్టీకి గుడ్ బై చెప్పేశారు. అలాంటి వారిలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు ముఖ్యులు. మోపిదేవి వెంకటరమణ వైసీపీలో మొదటి నుంచి కీలకంగా ఉన్నారు. వైఎస్ తో పాటు జగన్ తో సన్నిహితంగా ఉండేవారు. అలాంటాయనే పార్టీకి గుడ్ బై చెప్పేసి పదవికి కూడా రాజీనామా సమర్పించేశారు. బీద మస్తాన్ రావు కూడా ఇంతే. ఆయన రాజ్యసభ ఎంపీ. అయినా పదవికి, పార్టీకి గుడ్ బై చెప్పేశారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా పార్టీకి, పదవికి రాజీనామా చేశారు.

వైసీపీ నుంచి బయట పడగలిగారు కానీ కూటమిలో చేరిక మాత్రం ఆలస్యమవుతోంది. మోపిదేవి వెంకటరమణ తాను టీడీపీలో చేరబోతున్నట్టు బహిరంగంగానే ప్రకటించారు. అయితే ఆయన రాజీనామా చేసి 20 రోజులు దాటినా ఇంతవరకూ చేరలేదు. వరదల వల్ల ఆలస్యమైందని చెప్తున్నారు. మరోవైపు బీద మస్తాన్ రావు టీడీపీలో చేరతారనే ప్రచారం జరుగుతున్నా ఇంకా క్లారిటీ రావట్లేదు. పోతుల సునీత టీడీపీలో చేరేందుకు ఉత్సాహంగా ఉన్న ఆ పార్టీ శ్రేణులు మాత్రం ఆమెను చేర్చుకోవద్దంటూ బహిరంగంగానే స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. దీంతో వీళ్ల చేరిక ఆలస్యమవుతోంది.

అయితే రాజీనామా చేసిన నేతలు ఎదురు చూపులు చూస్తున్నారంటూ వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. టీడీపీని నమ్ముకుంటే ఇలాగే ఉంటుందని సెటైర్లు వేస్తున్నారు. పలువురు వైసీపీ నేతలకు టీడీపీ ఇప్పటికే గాలం వేసింది. వాళ్లలో కొందరు రాజీనామా చేయగా, మరికొందరు రాజీనామాలు సిద్ధం చేసి పెట్టుకున్నారు. అయితే రాజీనామా చేసిన వాళ్లే ఇప్పటికీ పార్టీలో చేరక ఇంటికి పరిమితమయ్యారు. దీంతో రాజీనామా చేయాలనుకున్నవాళ్లు అంతర్మథనంలో పడ్డారనే టాక్ నడుస్తోంది. ఇలాంటి నాన్చుడు ధోరణి నుంచి టీడీపీ బయట పడితే మంచిదని.. లేకుంటే మొదటికే మోసం వస్తుందని పలువురు హెచ్చరిస్తున్నారు.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :