MLC Elections : ఎమ్మెల్సీ ఎన్నికలపై వైసీపీ చేతులెత్తేసిందా..!?
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు మళ్లీ ఎన్నికల కోలాహలం నెలకొంది. పలు స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే పార్టీలు అభ్యర్థులను ఖరారు చేసి ఎన్నికల రణరంగంలో దిగిపోయాయి. కృష్ణ – గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీతో పాటు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటికి ఇప్పటికే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకుంటున్నారు. వచ్చే ఏడాది మార్చిలోపు ఈ ఎన్నికను ఎన్నికల సంఘం పూర్తి చేయనుంది. అయితే ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు వైసీపీ ప్రకటించింది.
ఉభయగోదావరి, ఉమ్మడి కృష్ణా-గుంటూరు పట్టటభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను ఎలాగైనా కైవసం చేసుకోవాలనే పట్టుదలతో అధికార కూటమి పనిచేస్తోంది. ఇప్పటికే ఈ రెండు స్థానాలకు అభ్యర్థులను కూడా ప్రకటించేసింది. కృష్ణా-గుంటూరు స్థానానికి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను, ఉభయగోదావరి జిల్లాల స్థానానికి పేరాబత్తుల రాజశేఖర్ పేరును టీడీపీ ప్రకటించింది. వీళ్లద్దరికీ బీజేపీ, జనసేన కూడా మద్దతు తెలిపాయి. కూటమి పార్టీలన్నీ పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించడంతో పాటు కచ్చితంగా రెండు స్థానాలను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో పనిచేస్తున్నాయి.
ఓటమి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వైసీపీ కూడా ఈ ఎన్నికల్లో బరిలోకి దిగుతుందని అందరూ ఆశించారు. పోటీ చేసి కాస్తోకూస్తా సత్తా చాటగలిగితే కేడర్ లో ఆత్మవిశ్వాసం కలుగుతుందని భావించారు. అయితే అసలు ఈ ఎన్నికల్లో పోటీ చేయకూడదనే నిర్ణయానికి వచ్చినట్టు వైసీపీ నేతలు ప్రకటించారు. రాష్ట్రంలో ప్రశాంతంగా ఎన్నికలు జరిగే పరిస్థితి లేదని.. ఓటర్లు స్వేచ్ఛగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేసుకునే సానుకూల వాతావరణం లేదని మాజీ మంత్రి పేర్ని నాని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తాము ఈ ఎన్నికలను బహిష్కరిస్తే బాగుంటుందని జిల్లా నేతలందరం జగన్ కు సూచించామని.. అందుకు జగన్ కూడా సానుకూలంగా స్పందించారని తెలిపారు.
గతేడాది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో జరిగిన రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికలే వైసీపీ ఓటమికి బాటలు వేశాయని చెప్పుకుంటూ ఉంటారు. ఆ తర్వాత జరిగిన సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ సంపూర్ణ పరాజయం చవిచూసింది. ఇప్పుడు కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ఏకంగా బహిష్కరించాలని నిర్ణయం తీసుకుంది. పార్టీ నేతలు తమ బహిష్కరణను సమర్థించుకుంటుంటే.. పోటీ చేయకుండా తప్పుకోవడం రాజకీయ పార్టీల లక్షణం కాదని మరికొందరు చెప్తున్నారు. ఎన్నికల బరిలోకి దిగి తాడోపేడో తేల్చుకోవాలని సలహా ఇస్తున్నారు.