ASBL Koncept Ambience
facebook whatsapp X

పవన్‌పై మారిన వైసీపీ స్టాండ్..! ప్రూఫ్ ఇదే..!!

పవన్‌పై మారిన వైసీపీ స్టాండ్..! ప్రూఫ్ ఇదే..!!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ఎప్పుడు ఎలాంటి మలుపులు తీసుకుంటాయో.. ఎవరు ఎవరిపై విరుచుకు పడుతుంటారో అస్సలు ఊహించలేం. ఇప్పుడు ఒక పార్టీలో ఉన్న నేతలు మరుసటి రోజుకు మరో పార్టీలో కనిపిస్తుంటారు. ఎత్తుకు పైఎత్తులు వేయడంలో ఏపీ పొలిటికల్ పార్టీలు ముందుంటాయి. గత ఐదేళ్లూ వైసీపీ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేశారు పవన్ కల్యాణ్. వైసీపీ కూడా ఆయనపై అదే రేంజ్ లో విరుచుకు పడేది. ఆయన్ని ఎంత బద్నాం చేయాలో అంతా చేసేసింది. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. వైసీపీ ఓడిపోయింది. పవన్ గెలిచి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జనసేనాని పవన్ కల్యాణ్ ను ప్రత్యేకంగా టార్గెట్ చేసి మరీ వేధించింది. ఆయన్ను వ్యక్తిగతంగా హింసించింది. మూడు పెళ్లిళ్లు చేస్కున్నారని.. ఆడవాళ్లపై అతనికి గౌరవం లేదని.. ఇలా ఎన్నో సూటిపోటి మాటలున్నారు. నేతలే కాదు.. సాక్షాత్తూ పార్టీ అధినేత జగన్ కూడా పలు సందర్బాల్లో పవన్ మూడు పెళ్లిళ్లను తెరపైకి తెచ్చి మాట్లాడేవారు. వైసీపీలోని కాపు లీడర్లతో పవన్ ను తిట్టించేవారు. తమపైకి ఆ బురద అంటకుండా జాగ్రత్త పడేవారు. వైసీపీ నేతల తీరు చూసి పవన్ కల్యాణ్ విసుగెత్తిపోయారు. ఆ పార్టీని గద్దె దించేందుకు తుది వరకూ పోరాడారు. చివరకు సక్సెస్ అయ్యారు.

నాడు వైసీపీ ఆ స్థాయిలో టార్గెట్ చేసి ఉండకపోతే పవన్ కల్యాణ్ లో ఈ కసి ఉండేది కాదు. ఆ కసితోనే టీడీపీ, బీజేపీలను ఏకతాటిపైకి తెచ్చి కూటమి కట్టారు. కూటమి ఏర్పాటులో పవన్ కల్యాణ్ పాత్ర ఎనలేనిది. కూటమి సక్సెస్ కావడం, ప్రభుత్వం ఏర్పాటు కావడం చకచకా జరిగిపోయాయి. వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. వైసీపీకి తాము ఎక్కడ తప్పు చేశామో అర్థమైంది. పవన్ కల్యాణ్ వల్లే ఈ రోజు టీడీపీ అధికారంలో ఉందని.. తాము ఓడిపోవడానికి అతనే కారణమని గ్రహించింది. అందుకే ఇప్పుడు పవన్ కల్యాణ్ పై స్టాండ్ మార్చుకుంది. తాజాగా పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో జగన్ పర్యటించారు. అక్కడ కూడా పవన్ పై ఏమాత్రం నోరు జారలేదు.

సహజంగా జనసేన నేతలు ఎవరైనా తప్పు చేస్తే పవన్ కల్యాణ్ ను ఆ ఉచ్చులోకి లాగడం వైసీపీ నైజం. ఇప్పుడు జానీ మాస్టర్ లైంగిక వేధింపుల ఆరోపణల్లో చిక్కుకున్నారు. ఆయన జనసేనలో ఉన్నారు. గత ఎన్నికల్లో జనసేన తరపున ప్రచారం కూడా చేశారు. పలువురు వైసీపీ నేతలు లైంగిక వేధింపుల కేసుల్లో చిక్కుకుని అభాసుపాలయ్యారు. అప్పుడు వైసీపీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఇప్పుడు జానీ మాస్టర్ వ్యవహారంపై జనసేనను వైసీపీ టార్గెట్ చేస్తుందని అందరూ అనుకున్నారు. అయితే ఈ వ్యవహారాన్ని వైసీపీ పెద్దగా పట్టించుకోలేదు. చూసీ చూడనట్లు వదిలేస్తోంది. వైసీపీ అనుకూల పత్రిక సాక్షి కూడా జానీ మాస్టర్ వ్యవహారాన్ని పవన్ కల్యాణ కు ఆపాదించకుండా సంయమనం పాటించింది. వీటన్నిటినీ గమనిస్తే పవన్ కల్యాణ్ పై జగన్ స్టాండ్ మార్చుకున్నట్టు అర్థమవుతోంది. పవన్ జోలికి వెళ్లి తప్పు చేశామని.. ఇంకా దాన్ని కొనసాగిస్తే మొదటికే మోసం వస్తుందని వైసీపీ భావిస్తున్నట్టు సమాచారం.

 

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :