YCP: వైసీపీకి సినిమా ఇండస్ట్రీ కలసి రావట్లేదా..!?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఓడిపోయిన తర్వాత పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఆ పార్టీని వీడుతున్న వాళ్ల సంఖ్య భారీగానే ఉంది. ఆ పార్టీకోసం ఎంతో శ్రమించిన వాళ్లు కూడా ఇప్పుడు మొహం చాటేస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు వైసీపీని వీడారు. మరికొంతమంది కూడా వీడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో పలువురు సెలబ్రిటీలు కూడా వైసీపీకి దూరం జరుగుతున్నారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్లు వైసీపీకి రాంరాం చెప్పేస్తున్నారు. వాస్తవానికి మొదటి నుంచి సినిమా ఇండస్ట్రీకి, వైసీపీకి మధ్య గ్యాప్ ఉందనే చెప్పాలి. ఇప్పుడు మరింత ఎక్కువయినట్లుంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సినిమా ఇండస్ట్రీని అంటీముట్టనట్టుగానే చూసింది. అయినా ఇండస్ట్రీలోని కొంతమంది ప్రముఖులు ఆ పార్టీపై అభిమానంతో దానికోసం పనిచేశారు. గతంలో పృథ్వీ వైసీపీకోసం ఎంతో కష్టపడ్డారు. అందుకే అధికారంలోకి రాగానే పృథ్వీకి ఎస్వీబీసీ ఛైర్మన్ పోస్టు కట్టబెట్టింది. అయితే ఆయన ఆ పదవిలో చాలాకాలం కొనసాగలేకపోయారు. తనను తప్పించడంతో ఆగ్రహించిన పృథ్వీ.. చివరకు ఆ పార్టీని వీడి.. దానికి వ్యతిరేకంగా పనిచేయడం మొదలు పెట్టారు.
టీడీపీ టికెట్ ఇవ్వలేదనే కోపంతో.. ఆ పార్టీని వీడిన కమెడియన్ ఆలీ.. వైసీపీలో చేరారు. వైసీపీ నుంచి తనకు టికెట్ వస్తుందని చివరివరకూ వెయిట్ చేశారు. కానీ అక్కడ కూడా ఆయనకు నిరాశే ఎదురైంది. అయినా కాదనలేక ఆ పార్టీలో కొనసాగుతూ వచ్చారు. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా కొంతకాలం ఆలీ ఆ పార్టీలోనే కొనసాగారు. అయితే ఏమైందో ఏమో.. ఇటీవల ఆయన పార్టీకి రాజీనామా చేసి బయటికొచ్చేశారు.
వైసీపీలో చేరకపోయినా ఆ పార్టీకోసం గొంతు చించుకుని పనిచేసిన వాళ్లలో శ్రీరెడ్డి, రామ్ గోపాల్ వర్మ, పోసాని కృష్ణమురళి ముందుంటారు. వైసీపీకోసం పోసాని ఏ రేంజ్ లో పనిచేశారో అందరికీ తెలుసు. ప్రతిపక్ష నేతలను, వాళ్ల కుటుంబసభ్యులను కూడా ఇష్టం వచ్చినట్లు టార్గెట్ చేశారు పోసాని. అందుకే ఆయనకు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవి కట్టబెట్టారు జగన్. వైసీపీ ఓడిపోయిన తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ పార్టీకి అనుకూలంగా మాట్లాడారు. తాజాగా టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడును ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై కేసుల పరంపర కొనసాగుతోంది. ఇంతలో ఆయన తాను రాజకీయాలకే శాశ్వతంగా గుడ్ బై చెప్తున్నట్టు ప్రకటించారు.
ఇక రామ్ గోపాల్ వర్మ, శ్రీరెడ్డి వైసీపీ సభ్యులు కాదు. నేరుగా వాళ్లకు వైసీపీ ఎలాంటి పదవులు ఇవ్వలేదు. అయినా వైసీపీ కోసం వాళ్లు తమన శక్తినంతా ధారపోసారు. సోషల్ మీడియాలో ఆ పార్టీకి అనుకూలంగా, విపక్షాలకు వ్యతిరేకంగా విచ్చలవిడిగా పోస్టులు పెట్టేవాళ్లు. కానీ ఇప్పుడు వైసీపీ ఓడిపోయింది. కూటమి అధికారంలో ఉంది. పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవు. అందుకే తాను ఇకపై ఏమీ మాట్లాడనని.. తనను క్షమించాలని పేరుపేరునా వేడుకుంటున్నారు శ్రీరెడ్డి. ఇక రామ్ గోపాల్ వర్మ అయితే ఎన్నికల ఫలితాలు రాగానే తానిక రాజకీయాల గురించి మాట్లాడబోనని చెప్పేశారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా సినీ రంగంతో గ్యాప్ కంటిన్యూ అయింది. టికెట్ల రేట్ల పెంపు విషయంలో ప్రభుత్వానికి, ఇండస్ట్రీకి మధ్య ఫైట్ ఏ రేంజ్ లో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇండస్ట్రీని తమ చెప్పుచేతల్లో ఉంచుకునేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నించింది. అదే సమయంలో చిరంజీవి లాంటి ప్రముఖులను కూడా జగన్ అవమానించారని ఇండస్ట్రీ భావించింది. మోహన్ బాబు మాత్రం గోడమీద పిల్లిలా ఎప్పుడు ఎక్కడ ఉంటారు తెలియని పరిస్థితి. నాగార్జున, ఆరె శ్యామల లాంటి ఒకరిద్దరు మినహా మిగిలిన ఇండస్ట్రీ మొత్తం వైసీపీతో అంటీముట్టనట్టే ఉందని చెప్పొచ్చు. ఓవరాల్ గా వైసీపీకి సినిమా ఇండస్ట్రీ ఏమాత్రం కలిసి రావట్లేదని చెప్పొచ్చు.