ASBL NSL Infratech
facebook whatsapp X

పార్టీ ప్రక్షాళనపై దృష్టి పెట్టిన జగన్..!?

పార్టీ ప్రక్షాళనపై దృష్టి పెట్టిన జగన్..!?

అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డీలా పడిపోయింది. ఆ పార్టీ అధినేత జగన్ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు పార్టీ శ్రేణులు కూడా పూర్తిగా నీరశించిపోయాయి. చాలా మంది కీలక నేతలు కూడా బయటకు రాలేకపోతున్నారు. కేడర్ ను కాపాడుకోవడం పార్టీ హైకమాండ్ కు పెద్ద సవాల్ గా మారింది. దీంతో పార్టీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలనే ఆలోచనలో జగన్ ఉన్నట్టు సమాచారం. త్వరలోనే ఆయన పార్టీలో కీలక మార్పులు, చేర్పులు చేస్తారని తెలుస్తోంది.

ఐదేళ్లపాటు సంక్షేమాన్ని కొత్తపుంతలు తొక్కించామని వైసీపీ భావిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రెండున్నర లక్షల కోట్లకు పైగా మొత్తాన్ని నేరుగా లబ్దిదారులకు అందించామని చెప్తోంది. అయినా ప్రజలు మాత్రం ఆ పార్టీని ఆదరించలేదు. పైగా ఏపీ చరిత్రలో ఏ పార్టీకి దక్కని ఘోర పరాజయాన్ని కట్టబెట్టారు. కేవలం 11 సీట్లకే పరిమితం చేశారు. దీంతో వైసీపీ పూర్తి నిరాశాపూరిత వాతావరణంలోకి వెళ్లిపోయింది. మరోవైపు ఐదేళ్లపాటు తమకు తిరుగే లేదన్నట్టు రెచ్చిపోయిన కేడర్ కూడా ఇప్పుడు తలెత్తుకోలేకపోతోంది. పార్టీ ఓటమి తర్వాత చాలా మంది నేతలు రాజకీయంగా యాక్టివ్ గా కనిపించడం లేదు. ప్రజలతో కలవడానికిక కూడా పెద్దగా ఇష్టపడట్లేదు.

మరోవైపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఐదేళ్ల అక్రమాలను వెలికి తీసేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో పలువురు వైసీపీ కీలక నేతలున్నట్టు గుర్తించి వారిపై కేసులు పెడుతోంది. ఇది మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇదే జరిగితే కీలక నేతలంతా జైలుకెళ్లాల్సి ఉంటుందని కేడర్ భయపడుతోంది. నేతలపైనే కేసులు నమోదవుతున్నప్పుడు ఇక తమను ఎందుకు వదిలిపెడ్తారనే భయం సెకండరీ కేడర్ లో కూడా కనిపిస్తోంది. అందుకే కొంతకాలం పాటు రాజకీయాల జోలికి వెళ్లకపోవడమే బెటర్ అనే ఫీలింగులో చాలా మంది నేతలు ఉన్నట్టు సమాచారం.

ఈ విషయం గ్రహించిన పార్టీ అధినేత జగన్ వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. త్వరలోనే పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకూ వైసీపీ అంటే పూర్తిగా రెడ్లదే ఆధిపత్యం. కీలక నేతలంతా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే. అయితే ఈసారి బడుగు, బలహీన వర్గాలకు పెద్ద పీట వేసేలా పదవులు ఇవ్వాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో ఎవరైతే టీడీపీని ఎదుర్కొని నిలబడగలుగుతారో వాళ్లకే కీలక పదవులు ఇవ్వాలని జగన్ భావిస్తున్నారని సమాచారం. త్వరలోనే ఈ మార్పులు ఉంటాయని వార్తలందుతున్నాయి.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :