ASBL Koncept Ambience
facebook whatsapp X

వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చిన బాలినేని..!!

వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చిన బాలినేని..!!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమంత బాగాలేదు. పలువురు నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. జగన్ కు ముందునుంచి నమ్మకంగా ఉన్న నేతలే పార్టీని వీడుతుండడం ఆ పార్టీ శ్రేణులను కలవరపెడుతోంది. మోపిదేవి వెంకటరమణ లాంటి నేతలు కూడా పార్టీకి గుడ్ బై చెప్తుంటే ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మరో కీలక నేత, జగన్ బంధువు బాలినేని శ్రీనివాస రెడ్డి కూడా వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. ఈ మేరకు ఆయన జగన్ కు లేఖ పంపించారు.

బాలినేని శ్రీనివాస రెడ్డి వైసీపీని వీడుతారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో బాలినేనికి ప్రత్యేకత ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న బాలినేని.. ఆ తర్వాత కాంగ్రెస్ కు రాజీనామా చేసి జగన్ పక్షాన చేరారు. జగన్ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీ తరపున పోటీ చేసి గెలిచారు. అప్పటి నుంచి ఆయన వైసీపీలో కీలక నేతగా ఉన్నారు. మొత్తం 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలినేని 2 సార్లు మంత్రిగా కూడా పని చేశారు. అయితే ఇటీవలి పరిణామాలు ఆయనకు నచ్చలేదు.

బాలినేని శ్రీనివాస రెడ్డిని జగన్ తన మొదటి విడత మంత్రివర్గంలోకి తీసుకున్నారు. రెండున్నరేళ్ల తర్వాత తొలగించారు. ఇది ఆయన అసంతృప్తికి కారణమైంది. జిల్లాలో తనను కాదని మరొకరిని కంటిన్యూ చేయడం ఆయనకు నచ్చలేదు. ఆ తర్వాత జిల్లాలో తాను అధ్యక్షుడిగా ఉన్నా ఇతరులు జోక్యం చేసుకోవడం, తనను డమ్మీని చేయడంపై బాలినేని పలుమార్లు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అయినా ఉపయోగం లేకుండా పోయింది. చివరకు ఎన్నికల సమయంలో ఒంగోలు పార్లమెంటు అభ్యర్థిత్వంపై బాలినేని పెద్ద పోరాటమే చేసినట్లు సమాచారం. అయినా బాలినేని మాట నెగ్గలేదు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఈవీఎంలపై బాలినేని ఫైట్ చేస్తున్నారు. ఈ పోరాటంలో కూడా పార్టీ నుంచి పెద్దగా సహాయసహకారాలు అందలేదు.

బాలినేని అసంతృప్తి తారస్థాయికి చేరడంతో ఆయన్ను బుజ్జగించేందుకు పార్టీ హైకమాండ్ రంగంలోకి దిగింది. జగన్ ఆయన్ను తాడేపల్లి పిలిపించుకుని మాట్లాడారు. ఆ తర్వాత హైదరాబాద్ కు విడదల రజనిని పంపించి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా బాలినేని వైఖరిలో మార్పు రాలేదు. చివరకు ఆయన ఇవాళ తన రాజీనామా ఖరారు చేశారు. తాను వైఎస్ కుటుంబానికి సన్నిహితుడే అయినా జగన్ నిర్ణయాలు సరిగా లేనప్పుడు నిర్ణయం తీసుకోక తప్పదనేలా ఆయన లేఖలో పేర్కొన్నారు. ఆయన జనసేన పార్టీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అటు జనసేన కానీ, ఇటు బాలినేని కానీ స్పందించలేదు.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :